Mahesh Babu promotes Nirvana short filmసోషల్ మీడియాలో ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి ఖాతాలు ఉన్నాయన్న మాటకే గానీ, ఎప్పుడో గాని స్పందించని మహేష్ బాబు, తాజాగా ఓ షార్ట్ ఫిల్మ్ కోసం స్పందించడం విశేషం. ప్రిన్స్ ఇలాంటివి కూడా షేర్ చేసుకుంటారా… అన్న రీతిలో… రాజు కోలగాని స్వీయ నిర్మాణ దర్శకత్వం వహించి, నటించిన “నిర్వాన” షార్ట్ ఫిల్మ్ లింక్ ను షేర్ చేసుకుంటూ ‘ఆల్ ది బెస్ట్’ చెప్పారు ప్రిన్స్. చాలా అరుదుగా మాత్రమే సోషల్ మీడియాలో స్పందించే ప్రిన్స్ నుండి ఓ షార్ట్ ఫిల్మ్ లింక్ రావడంతో, అభిమానుల చూపులు ఈ షార్ట్ ఫిల్మ్ పై పడ్డాయి.

ఓ సాఫ్ట్ వేర్ జీవితం ఎలా ఉంటుందో అన్న దానికి నిదర్శనంగా ఈ “నిర్వాన” షార్ట్ ఫిల్మ్ ఉందని చెప్పవచ్చు. కెరీర్ లో ఎదుగుతున్నానని భావించి, తన తల్లితండ్రులకు, ప్రేయసికి దూరంగా ఉండే సాఫ్ట్ వేర్ ఇంజినీర్, ఒక పాయింట్ ఆఫ్ టైం లో తన జీవితం ఎటు పోతుందో అని ఆలోచించుకుని, సదరు జాబ్ కు రిజైన్ చేయడమే క్లుప్తంగా ఈ షార్ట్ ఫిల్మ్ కధ. ఐటీకి సంబంధించిన ప్రతి ఒక్కరిని కదిలించే విధంగా ఉన్న షార్ట్ ఫిల్మ్ కు అభినందనలు కూడా బాగానే వస్తున్నాయ్! ప్రిన్స్ షేరింగ్ కదా… ఈ మాత్రం హంగామా లేకపోతే ఎలా..!