Mahesh Babu praises his Fans “మీ లాంటి ఫ్యాన్స్ ఏ హీరోకు ఉండరు… నాకు నచ్చుతారు మీరు… మీరు నా సినిమా నచ్చితేనే చూస్తారు… నచ్చకపోతే మీరే చూడరు… మీరు ఎప్పుడూ అలానే ఉండాలి… మీ కోసం మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను…” అంటూ ‘స్పైడర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అభిమానులను ఉద్దేశించి ప్రిన్స్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. నిజమే… ప్రిన్స్ వ్యాఖ్యానించిన ప్రతి మాట అక్షర సత్యం. ఇండస్ట్రీలో అందరి హీరోలకు అభిమానులు ఉంటారు గానీ, తమ హీరో సినిమా బాగోకపోతే, ప్రిన్స్ ఫ్యాన్స్ చెప్పినంత ఓపెన్ గా మరొకరి అభిమానులు చెప్పరు… మహేష్ ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం కూడా అదే..!

ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలలో ఎక్కువగా పాల్గొనేది అభిమానులే. అంటే ముందుగా సినిమాను చూసే వారిలో అభిమానులే ఎక్కువగా ఉంటారు. అంటే సినిమా ఎలా ఉన్నా… అభిమానులు చూస్తారు కాబట్టి సాధారణంగా పాజిటివ్ టాక్ బయటకు రావాలి. కానీ మహేష్ విషయంలో ఇప్పటివరకు కేవలం రెండే రెండు (ఒక్కడు, శ్రీమంతుడు) సినిమాల విషయంలో ముక్తకంఠంగా పాజిటివ్ టాక్ వచ్చింది. అంటే మిగతా సినిమాల విషయాలలో ఎక్కడో మహేష్ అభిమానులకే అసంతృప్తి నెలకొందన్న మాట. అయితే ఆ తర్వాత అందులో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టాయిలేండి… అది వేరే విషయం..!

ముఖ్యంగా ప్రిన్స్ నటించిన గత చిత్రం “బ్రహ్మోత్సవం” దారుణ పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే ఈ సినిమాను అభిమానులు పూర్తిగా తిరస్కరించారు. ఇంత నిర్మొహమాటంగా తమ హీరోల సినిమాలను తిరస్కరించే ఫ్యాన్స్ చాలా అరుదు కాబట్టే, ఏ హీరోకు ఉండని అభిమానగణం తన సొంతం అని ప్రిన్స్ చెప్పడంలో అతిశయోక్తి లేదు. నాని, నిజం, ఖలేజా, 1 నేనొక్కడినే… ఈ ప్రయోగాలకు విడుదలైన సమయంలో ‘నో’ చెప్పిన అభిమానులు, బుల్లితెరపై వారే సూపర్ హిట్ గా నిలిపారు కూడా! ఇప్పటికీ ఎంజాయ్ చేస్తున్నారు కూడా! మరి “స్పైడర్” విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి.