mahesh-babu-politics‘రాజకీయాలకు నేను ఎప్పటికీ దూరం…’ ఇది పొలిటిక్స్ పై ప్రిన్స్ మహేష్ బాబు సింగిల్ లైన్ ఎజెండా. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమయంలో ప్రిన్స్ పొలిటికల్ ఎంట్రీపై అనేక వార్తలు హల్చల్ చేసిన నేపధ్యంలో… ఓ స్పష్టమైన ప్రకటన చేసి చేతులు దులుపుకున్నారు ప్రిన్స్. ఇక అప్పటి నుండి ప్రిన్స్ పై రాజకీయంగా ఎలాంటి వార్తలు వినిపించలేదు. గత ఎన్నికలలో తన బావ గల్లా జయదేవ్ ను గెలిపించమని కోరారు గానీ, అది పార్టీ పేరు ప్రస్తావించకుండానే తెలిపారు.

ఇప్పుడే కాదు… ఎప్పటికీ తన అభిప్రాయం ఇదే అనే విధంగా పలు సందర్భాలలో ప్రిన్స్ స్పష్టత ఇచ్చారు. మెగా, అక్కినేని, నందమూరి కాంపౌండ్స్ నుండి ఒక్కొక్కరుగా హీరోలు వచ్చి పడుతున్నా…. ‘ఘట్టమనేని’ కుటుంబంకు ప్రాతినిధ్యం వహిస్తూ అంచలంచెలుగా తారాస్థాయికి చేరుకున్న ప్రిన్స్ కు, కుటుంబ పరంగా లభించిన అండదండలు చాలా తక్కువే అని చెప్పాలి. సూపర్ స్టార్ కృష్ణ అభిమానగణం ఉంది గానీ, ప్రిన్స్ తన స్వశక్తితోనే ఈ స్థాయికి చేరుకున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

అందుకే ప్రిన్స్ అంటే అన్ని వర్గాలలోనూ అభిమానం ఎక్కువగా ఉంటుంది. అయితే దానినే ఇప్పుడు ఘట్టమనేని కుటుంబం రాజకీయాలకు ఉపయోగించుకోవాలని చూడడం విస్మయం కలిగించే విషయం. తాజాగా మహేష్ బాబాయ్ ఆదిశేషగిరిరావు నంద్యాలలో ప్రిన్స్ అభిమానులతో సమావేశమై, వైసీపీ గెలిపించాలని కోరడం విమర్శలకు దారి తీసింది. ఓ పక్కన తాను రాజకీయాలకు దూరం అని మహేష్ చెప్తుంటే, ప్రిన్స్ అభిమానాన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలని కృష్ణ సోదరుడు చూడడం శోచనీయం.

వివాదాలకు దూరంగా ఉండే మహేష్ కు ఇవన్నీ సరికొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నట్లే భావించాలి. మహేష్ ఎదుగుదలలో ఆది గారి సహాయం ఎంతవరకు ఉందో గానీ, మహేష్ కు లేనిపోని తలనొప్పులు తెచ్చిపెట్టడంలో మాత్రం సింహాభాగం ఉన్నట్లుగా కనపడుతోంది. ఏ పార్టీకి ఓటు వేస్తారన్న విషయం పక్కన పెడితే, ఇలా ప్రెస్ మీట్ లు పెట్టి బహిరంగ ప్రకటనలు ఇవ్వడం ఒక రకంగా ప్రిన్స్ అభిమానులకే నచ్చడం లేదు. తమ అభిమాన హీరోను ఇరుకుల్లో పెట్టే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రిన్స్ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.