Mahesh babu planning international school in amaravatiతన తనయుడు గౌతమ్ కృష్ణ జననంతో పూర్తిగా మారిన మనిషి మహేష్ బాబు. అప్పటివరకు మామూలుగా ఉన్న ప్రిన్స్, గౌతమ్ ప్రీ మెచ్యూర్ జననంతో మారి పిల్లల కోసం ఏదొకటి చేయాలన్న ఆకాంక్షను వివిధ సందర్భాలలో వ్యక్తపరిచిన విషయం తెలిసిందే. అందుకు తగిన విధంగా ప్రస్తుతం ‘హీల్ ఎ చైల్డ్’ వంటి సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటున్న ప్రిన్స్, త్వరలో ఏపీ రాజధాని అయిన అమరావతిలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

సాధారణంగా సినీ సెలబ్రిటీలు ఫైవ్ స్టార్ హోటల్స్ నో, సినీ స్టూడియోలనో నిర్మించడానికి మొగ్గు చూపుతుంటారు. కానీ అందుకు విరుద్ధంగా మహేష్ మాత్రం ఓ అంతర్జాతీయ స్కూల్ ను ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత గుంటూరు ఎంపీ, తన బావ గల్లా జయదేవ్ సూచనల మేరకే ఈ ప్రాజెక్ట్ ను తీసుకోవాలని ప్రిన్స్ నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. ఇప్పటికే గుంటూరు జిల్లా, బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకుని విద్య, వైద్య కార్యక్రమాలపై దృష్టి సారించిన మహేష్, తాజాగా అదే జిల్లా అయిన అమరావతి వైపు మొగ్గు చూపడం విశేషం.

అధికారికంగా ఈ సమాచారం వెల్లడి కాలేదు గానీ, ట్రేడ్ వర్గాలలో మాత్రం బలంగా వినపడుతోంది. గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీగా ఉండడం దీనికి మరింత బలాన్నిచ్చే అంశంగా మారింది. అమరావతిలో ప్రాజెక్ట్ ల కోసం ముందుకు వస్తున్న వారికి చంద్రబాబు ప్రభుత్వం కూడా భూములను ఉచితంగా అందిస్తుండడంతో, కేవలం నిర్మాణానికి అయ్యే ఖర్చులు భరిస్తే సరిపోతుంది గనుక ఈ ప్రాజెక్ట్ కార్యరూపం సిద్ధించుకునే అవకాశాలు ఎక్కువే అని తెలుస్తోంది గానీ, సెలబ్రిటీలపై వచ్చే వార్తలను చివరి నిముషం వరకు నమ్మలేం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.