Mahesh Babu onSpyder Resultసినిమా విడుదలకు ముందు ఇచ్చిన అనేక ప్రమోషన్స్ లో, ప్రిన్స్ మహేష్ బాబు “స్పైడర్” సక్సెస్ పట్ల పూర్తి నమ్మకాన్ని వ్యక్తపరిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలోనే ‘స్పైడర్’ సినిమాను మహేష్ బాబు తప్ప, మరొకరు చేయలేరని మురుగదాస్ చెప్పిన విషయాన్ని యాంకర్ ప్రస్తావించగా, దానికి మహేష్ బాబు సమాధానమిస్తూ… ‘లేదండి, అలా చెప్పడం ఆయన గొప్పతనం, ఈ పాత్రను ఎవరైనా చేయవచ్చు. కానీ ఎస్.జే.సూర్య పాత్రను మాత్రం ఆయన తప్ప మరొకరు చేయలేరు, ఇది సినిమా చూస్తే మీకే అర్ధమవుతుంది’ అంటూ చెప్పుకొచ్చారు.

ఇప్పుడు సినిమా బయటకు వచ్చి రెండు రోజులయ్యింది. మహేష్ ఏదైతే చెప్పారో… అది అక్షరం పొల్లుపోకుండా నిజమైంది. నిజమే… మహేష్ పాత్రను ఎవరైనా చేయవచ్చు, అసలు విషయం చెప్పాలంటే మహేష్ అస్సలు చేయకూడని పాత్ర ఇది. అందులో కొత్తదనం ఏం లేదు, చేయడానికి కూడా ఏం లేదు, ఒక్క ఏమోషన్స్ ను పండించడం తప్ప! కానీ ఎస్.జే.సూర్య పాత్రకు అభినయం ప్రదర్శించడానికి చాలా అవకాశం లభించింది. ఈ పాత్ర తీర్చిదిద్దిన తీరే కొత్తదనంతో నిండుకుని ఉంది. ఇప్పటివరకు కనిపించని ‘సైకో’ విలనిజాన్ని మురుగదాస్ బాగా పండించారు.

నిజానికి సినిమా నెగటివ్ టాక్ రావడానికి ప్రధాన కారణం కూడా ఇదే. విలనిజంను అద్భుతంగా పండించిన మురుగదాస్, హీరోయిజంను ఏ మాత్రం పండించలేకపోయారు. ఇదే ‘స్పైడర్’కు అసలు మైనస్. రెండున్నర్ర గంటల సినిమాలో ఓ రెండు సీన్లలో మాత్రమే హీరోయిజంను చూపించారంటే… మహేష్ క్యారెక్టర్ ఎంత పేలవంగా డిజైన్ చేసారో అర్ధం చేసుకోవచ్చు. మహేష్ – మురుగదాస్ కాంభినేషన్ అన్నారు… ఇంటిలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ అన్నారు… దీంతో ప్రిన్స్ ద్వారా అద్భుతాలు సృష్టిస్తారని ఏ సగటు అభిమాని అయినా భావిస్తారు. కానీ ధియేటర్ లోపలి వెళితే గానీ తెలియదు అసలు “సినిమా” ఏంటన్నది.

ఇది తమిళులకు బాగా నప్పవచ్చు. ఎందుకంటే ఇలాంటి సైకో విలనిజంతో కూడిన పాత్రలను ఆదరించడంలో తమిళ ప్రేక్షకులు ముందుంటారు. అందుకే తెలుగు కంటే తమిళ టాక్ బెటర్ గా ఉందని చెప్పాలి. ఎస్.జే.సూర్య ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నుండి క్లైమాక్స్ వరకు కనిపించినప్పుడల్లా వచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు హరీష్ జయరాజ్ కు హ్యాట్సాఫ్ చెప్పొచ్చు. నిజానికి ఈ సినిమాలో యూనివర్సల్ గా ఆకట్టుకునే అంశాలు రెండే రెండు… ఒకటి ఎస్.జే.సూర్య… రెండు హరీష్ జయరాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్..! ఈ రెండింటిపై అంచనాలు పెట్టుకుని వెళితే ఖచ్చితంగా “స్పైడర్” నచ్చుతుంది.

అయితే తన పాత్రను ఏ హీరో అయినా చేయవచ్చని ముందుగానే తెలిసిన మహేష్ బాబు, ఈ కధను ఎందుకు ఎంపిక చేసుకున్నట్లు? నిజంగా మహేష్ ఒక రోల్ చేస్తే… అందులో మరో హీరోను ఊహించుకోవడం అసాధ్యం అనిపించే విధంగా ఉంటుంది. బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్లుగా మిగిలిన “ఖలేజా, 1 నేనొక్కడినే” వంటి సినిమాలే ఇందుకు నిదర్శనం. అందుకే తన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయినా, అభినయంలో ఎప్పుడూ నిరుత్సాహపరచరు అన్న టాక్ తో అభిమానుల సంఖ్య పెరుగుతూ పోతుండేది. కానీ ‘బ్రహ్మోత్సవం, స్పైడర్’ సినిమాలు ఇందుకు మినహాయింపు. రెగ్యులర్ కధలను ఎంపిక చేసుకుంటూ… అటు బాక్సాఫీస్ ను గానీ, ఇటు ఫ్యాన్స్ ను గానీ మెప్పించలేకపోతున్నాడు ప్రిన్స్.