Mahesh Babu next movie with V V Vinayakనటశేఖర సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా సినీ రంగప్రవేశం చేసిన ప్రిన్స్ మహేష్ బాబు, ఓ విషయంలో మాత్రం తండ్రి వారసత్వాన్ని అనుసరించలేకపోయారు. భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న కృష్ణ ఫ్యాన్స్ ను సంతృప్తి పరచడంలో ప్రిన్స్ విఫలమయ్యారు అనేది వాస్తవం. కనీసం ఒక్కటైనా పక్కా మాస్ సినిమా చేయాలని కృష్ణపై, మహేష్ పై అభిమానులు ఒత్తిడి తీసుకువచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంత బలవంత పెడితేనే ‘పోకిరి’ వచ్చిందన్న సంగతి స్వయంగా మహేషే వెల్లడించాడు… దాని ఫలితం ఏంటో తెలిసిందే.

అయితే ఇప్పటివరకు మహేష్ చేసిన చిత్రాలలో పక్కా మాస్ గా చేసిన చిత్రాలు లేవు. ‘పోకిరి’ తర్వాత కాస్తో కూస్తో ‘దూకుడు, బిజినెస్ మెన్, ఆగడు’ చిత్రాలు ఈ కోణంలోకి వస్తాయి. బహుశా సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ ఇవ్వాలని భావించారో ఏమో గానీ, ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాల తర్వాత పక్కా మాస్ డైరెక్టర్స్ తో మహేష్ జోడి కట్టనున్నాడన్న వార్త కృష్ణ అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ‘స్పైడర్’ తర్వాత ‘భరత్ అనే నేను’ ఉండగా, ఆ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25వ సినిమా చేయనున్నారు.

ఇక మహేష్ కెరీర్ లో 26వ సినిమాగా వి.వి.వినాయక్ దర్శకత్వంలోని సినిమా ఉండబోతుందని, 27వ సినిమాగా బోయపాటి శ్రీనుతో మరో సినిమా ఉండనుందని సమాచారం. ఇప్పటివరకు ఒక్క పూరీ, శ్రీను వైట్ల తప్ప మాస్ డైరెక్టర్స్ తో మహేష్ పని చేసింది లేదు. అలాంటిది వరుసగా రెండు సినిమాలను పక్కా మాస్ డైరెక్టర్స్ ను ఎంచుకోవడం ట్రేడ్ వర్గాల్లో విశేషంగా చెప్పుకుంటున్నారు. మరి ఈ రెండు ఉంటే… త్రివిక్రమ్, రాజమౌళి సినిమాల మాట ఏమైనట్లు… అన్న డౌట్ రావడం సహజం. వారు లైన్ లోకి వస్తే… ఇవి కాస్త అటు ఇటు అయ్యే అవకాశాలు స్పష్టం.