మహేష్ లో ఎంత మార్పు! సంక్రాంతికి ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ తో ఏప్రిల్ 1వ తేదీకి తన “సర్కార్ వారి పాట” సినిమాను వాయిదా వేసి అభిమానులను ఒకింత నిరుత్సాహపరిచిన సూపర్ స్టార్ మహేష్ బాబు, స్మాల్ స్క్రీన్ పై మాత్రం ఫ్యాన్స్ కు కావాల్సిన స్టఫ్ ను ఇవ్వడంలో నిమగ్నమవ్వడం ఊహించని పరిణామాలు.

ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో ఎపిసోడ్ స్మాల్ స్క్రీన్ పై టెలికాస్ట్ కు సిద్ధమైంది. ఆదివారం నాడు జెమిని టెలివిజన్ లో ప్రసారం కాబోతున్న ఈ ఎపిసోడ్ కోసం ఇద్దరు హీరోల అభిమానులు ఎంతగానో నిరీక్షిస్తున్నారు. టీఆర్ఫీ రేటింగ్స్ లో సంచలనం సృష్టించే ఎపిసోడ్ గా ట్రేడ్ వర్గాలు లెక్కలు కడుతున్నాయి.

తాజాగా మరో నందమూరి టాక్ షోలో ప్రత్యక్షం అయ్యారు మహేష్ బాబు. తొలిసారిగా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ప్రిన్స్ దర్శనం ఇవ్వబోతుండడం ఫ్యాన్స్ కు మరింత కిక్ ను పంచుతోంది. ‘ఆహా’లో నందమూరి నటసింహం బాలకృష్ణ చేస్తోన్న ‘అన్ స్టాపబుల్’ టాక్ షోలో పాల్గొన్న మహేష్ ఫోటోలతో సోషల్ మీడియా నిండిపోయింది. బహుశా సంక్రాంతి ముందే వచ్చిందేమో అనిపించేలా ఈ పిక్స్ సందడి చేస్తున్నాయి.

ఈ రెండు ఉదంతాలు కూడా మహేష్ ఆలోచనల్లోని మార్పును సూచిస్తున్నాయి. ఒకప్పుడు ట్రెండింగ్ అంశాలను పెద్దగా పట్టించుకోకుండా కేవలం సినిమాల వరకే ప్రిన్స్ పరిమితం అయ్యేవారు. కానీ నేడు ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో ఉంచుకుని వారికి ఎలా మరింతగా దగ్గరవ్వాలో, ఆయా మార్గాలలో అడుగులు వేస్తున్నారు.

ఈ రెండు ఎపిసోడ్స్ సంగతే కాదు, సోషల్ మీడియాలోనూ గతంలో ఎన్నడూ లేని మాదిరి మహేష్ యాక్టివ్ గా ఉంటున్నారు. ఇంతకు ముందు ఏడాదికి నాలుగైదు ట్వీట్స్ చేయడమే గగనం అయిపోయే మహేష్, ఇప్పుడు మాత్రం నెలకో నాలుగైదు ట్వీట్స్ తో సందడి చేస్తున్నారు. ఏది ఏమైనా మహేష్ లో వచ్చిన ఈ మార్పు అభిమానులకు మాత్రం వరంలా మారింది.