mahesh-pawanఈ దీపావళికి ప్రిన్స్ మహేష్ బాబు తాజా సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ లోగో మరియు కొన్ని సెకన్ల పాటు సందడి చేసే టీజర్ బయటకు రానుందన్న సమాచారంతో అభిమానులు ఎంతో ఆశగా ఈ దీపావళి వేడుక కోసం ఎదురు చూస్తున్నారు. అయితే మహేష్ అభిమానులతో పాటు, తన ఫ్యాన్స్ ను కూడా ఆనందంలో ముంచెత్తేందుకు పవర్ స్టార్ రెడీ అయినట్లుగా సినీ వర్గాల సమాచారం.

ఈ దీపావళికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా అధికారిక ప్రకటన రాబోతోందని తెలుస్తోంది. అది కూడా పవన్ అభిమానులు ఎంతగానో కోరుకునే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కావడం మరింత స్పెషల్! ప్రస్తుతం పవన్ డాలీ దర్శకత్వంలో నటిస్తుండగా, తదుపరి చిత్రం ‘జిల్లా’ ఫేం నీసన్ డైరక్షన్ లో ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. దీంతో సందిగ్ధంలో పడిన మాటల మాంత్రికుడు సినిమాకు ఈ దీపావళి సమాధానం ఇవ్వనుంది.

దీపావళి నాడు ప్రకటన రానుండగా, నవంబర్ 5వ తేదీన ప్రారంభోత్సవ ముహూర్తం జరుపుకోనుంది. అలాగే డిసెంబర్ 16వ తేదీ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాకు అనిరుథ్ సంగీతం అందిస్తున్న విషయం ఇప్పటికే అధికారికంగా ఖరారైంది. సదరు మొత్తం సమాచారంతో ఈ నెలాఖరు వేడుకలు జరుపుకోవడానికి ప్రిన్స్ అభిమానులతో పాటు పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.