mahesh-babu-missed-fida-telugu-movie-sekhar-kammula‘క్లాస్’ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు చేయబోతున్నారనేది ఒకప్పుడు సందడి చేసిన వార్త. అవును… నిజమే… ఎప్పుడూ స్టార్ హీరోల దరికి చేరని శేఖర్ కమ్ముల, తొలిసారిగా ప్రిన్స్ మహేష్ బాబును కలిసి ఓ కధ వినిపించారు. అంతేకాదు, శేఖర్ చెప్పిన కధ మహేష్ కు కూడా నచ్చింది. అయితే సినిమా మాత్రం కార్యరూపం దాల్చుకోలేకపోయింది. అసలేం జరిగిందో… తాజాగా ఈ క్లాస్ డైరెక్టర్ చెప్పుకొచ్చారు.

“ఫిదా” కధను మహేష్ బాబుకు చెప్పానని, బాగా నచ్చింది చేద్దాం అన్నారు, అయితే సమయం గడుస్తున్న కొద్దీ వాయిదాలు పడడంతో, ఎంతకాలం వేచిచూస్తారు… సినిమా తీసేసుకోమని మహేష్ చెప్పడంతో, ఈ కధను ప్రస్తుతం తెరకెక్కిస్తున్నానని, ఖచ్చితంగా హిట్ కాబోయే సినిమాగా అభివర్ణించారు కమ్ముల. ఒక పూర్తి ప్రేమకధా చిత్రమని, లవ్ స్టోరీలను నేను బాగా తీస్తానని నమ్మకమని, గ్యారెంటీగా సక్సెస్ సాధిస్తానన్న నమ్మకాన్ని వెలిబుచ్చారు.

స్టార్ హీరోలు అనే పాటికి, వారిపై చాలా ఒత్తిడి ఉంటుందని, వారిపై చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సర్క్యూలేట్ అవుతుంటాయని, ఒక్కోసారి వారు చేయాలనుకున్నా, పరిస్థితులు చేయనియవని అన్నారు. అయితే తొలుత మహేష్ కు కధ చెప్పడానికి వెళ్ళినపుడు బాగా భయపడ్డానని, సమంత పోస్టర్ విషయంలో రేపిన ఉదంతాన్ని ప్రిన్స్ తీసుకున్న తీరు చూసి, నిజంగా ఆయన వ్యక్తిత్వానికి సెల్యూట్ చేస్తున్నానని ఏమోషనల్ గా చెప్పుకొచ్చారు శేఖర్ కమ్ముల.

ఈ క్లాస్ దర్శకుడు చెప్తున్న మాటలను బట్టి, ఒక మాంచి లవ్ స్టోరీని ప్రిన్స్ మిస్ చేసుకున్నాడని అర్ధమవుతోంది. నిజానికి మహేష్ ను ఒక పూర్తి ప్రేమకధాచిత్రంలో చూడాలనేది ఎప్పటినుండో అభిమానుల కోరిక. బహుశా “ఫిదా” చిత్రంలో చేసినట్లయితే, ప్రిన్స్ ఫ్యాన్స్ ముచ్చట కూడా తీరేదేమో! ఈ సినిమా మహేష్ చేస్తున్నట్లు దర్శకుడు కృష్ణవంశీ కూడా గతంలో ఓ ప్రకటన చేసారు. అయితే అవన్నీ పేపర్ కే పరిమితం కాగా, “ఫిదా” విడుదలైతే గానీ మహేష్ అభిమానుల నిజమైన ఫీలింగ్ వెల్లడికాదు.