mahesh-babu-maa-associationమరో రెండు రోజుల్లో “సిల్లీ ఫెలోస్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అల్లరి నరేష్, ప్రిన్స్ మహేష్ బాబు “మహర్షి” సినిమాలో కూడా ఓ కీలకపాత్ర చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘సిల్లీ ఫెలోస్’ ప్రమోషన్స్ లో ఉన్న అల్లరి నరేష్ కు ‘మహర్షి’ సినిమాలో చేస్తోన్న రవి రోల్ పై ప్రశ్నలు వెలువడ్డాయి.

మహేష్ కు జతగా ఓ పేద స్నేహితుడి పాత్రలో నటిస్తోన్న మాట వాస్తవమేనని, ఒక రకంగా ‘గమ్యం’ సినిమాలో గాలి శీను రోల్ తరహాలో ఉంటుందని, ఆ పాత్ర ఎలా అయితే ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యిందో ఇది కూడా అలాగే అవుతుందని, ఇంతకుమించి ఏమీ చెప్పొద్దంటూ మహేష్ బాబు నుండి ‘స్వీట్’ వార్నింగ్ వచ్చిందంటూ ఛలోక్తులు విసిరారు.

ఇప్పటివరకు 45 రోజులు మహేష్ తో కలిసి పనిచేసానని, అలాగే మరో 100 రోజులు లాంగ్ షెడ్యూల్ కు వెళ్తున్నామని అన్నారు. 145 రోజులు ‘మహర్షి’లో భాగస్వామ్యం అవుతున్నాడంటే, ఇది గెస్ట్ రోల్ కాదు, సినిమా మొత్తం అల్లరి నరేష్ ఉంటాడని చెప్పకనే చెప్పాడు. ఇక తాజా చిత్రం ‘సిల్లీ ఫెలోస్’ అందరినీ నవ్వించే చిత్రంగా నిలుస్తుందన్న భావనను వ్యక్తపరిచారు అల్లరోడు.