Mahesh Babu Latest SPyder Working Stillsఈ పోస్టర్ లో ప్రిన్స్ మహేష్ బాబును చూస్తే ఏమనిపిస్తుంది? ఆల్ ఇండియాలో అమాయకత్వం అంతా తన దగ్గరే ఉన్నట్లుగా హావభావాలను ప్రదర్శిస్తున్న ఈ స్టిల్, సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకులను పలకరించబోతున్న “స్పైడర్” సినిమా లోనిది. అవును… ఎలాంటి హావభావాలనైనా చిటికెలో ప్రదర్శించే ప్రిన్స్ అభినయానికి నిదర్శనంగా నిలుస్తోన్న ఈ స్టిల్, ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

సిల్వర్ స్క్రీన్ అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించే ఈ తరం నటులలో ముందు వరుసలో ఉండే ప్రిన్స్ నుండి, బయో టెర్రరిజం నేపధ్యంలో తెరకెక్కుతోన్న “స్పైడర్” సినిమా కోసం అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అయితే ఈ స్టిల్ మాత్రం సింపుల్ లుక్ లో అమాయకంగా ఎవరినో చూస్తున్నట్లుగా కనపడుతోంది. ఓ దేవాలయంలో ఈ షాట్ ను చిత్రీకరించారని వెనుక గోడలు, పక్కన పూలు స్పష్టం చేస్తున్నాయి.

మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు హరీష్ జయరాజ్ సంగీతం అందించారు. మొత్తం 5 పాటలున్న ఆల్బమ్ ఆగష్టు నెలాఖరున విడుదల కానుండగా, ఆగష్టు 9న మాత్రం సినిమా కంటెంట్ ను బయటపెట్టే టీజర్ రాబోతోంది. రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషలలో విడుదల కావడం ఖరారు కాగా, హిందీ భాషలో రిలీజ్ పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.