Mahesh Babu Koratala Siva New Upcoming Movie Newsకొరటాల శివ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మించబోతున్న సినిమా నేడు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. యధావిధిగా సెంటిమెంట్ పరంగా ఈ సినిమా ప్రారంభోత్సవానికి కూడా ప్రిన్స్ హాజరు కాలేదు. ‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్ బస్టర్ బ్యాక్ గ్రౌండ్ లో ఉండడంతో ఈ కాంభినేషన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ‘శ్రీమంతుడు’కు మించిన పవర్ ఫుల్ సబ్జెక్ట్ తో ఈ సారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నామని దర్శకుడు కొరటాల శివ స్పష్టం చేసారు.

ప్రిన్స్ మహేష్ బాబు ఇంతకు ముందు ఎపుడూ పోషించని పాత్రను ఈ సినిమాలో చేయబోతున్నారని, ప్రిన్స్ సరసన నటించబోయే హీరోయిన్ ఎంపిక ఇంకా జరగలేదని, అలాగే ఇతర పాత్రల్లో భారీ తారాగణం నటిస్తారని చెప్పుకొచ్చారు. చాలా కాలం నుండి నిరీక్షిస్తున్న రోజు నేడు వచ్చిందని, మహేష్ తో సినిమా చేయాలన్న తన చిరకాల కోరిక నెరవేరుతున్నంధుకు మిక్కిలి సంతోషం వ్యక్తం చేసారు నిర్మాత దానయ్య. తెలుగు సినిమా స్థాయిని పెంచేదిగా నిర్మాణం జరగనున్న ఈ సినిమాను వచ్చే ఏడాది దసరా నాటికి విడుదల చేస్తామని దానయ్య స్పష్టత ఇచ్చారు.

‘శ్రీమంతుడు’ కంటే పెద్ద కధగా రాబోతున్న ఈ సినిమా ఆడియో కూడా పెద్దగా ఉంటుందని సంగీత సంచలనం దేవీశ్రీప్రసాద్ చెప్పారు. వరుసగా కొరటాల శివ సినిమాలన్నీ చేయడం సంతోషంగా ఉందని అన్నాడు. ఇక, సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ మాట్లాడుతూ… ఎన్నో భారీ చిత్రాలకు పని చేసినా… అభిమాన హీరోతో చేయడం సంథింగ్ స్పెషల్ అని తన భావాలను పంచుకున్నారు. మొత్తమ్మీద ఒక సినిమా సెట్స్ పైన ఉండగానే మరో సినిమాను ప్రారంభించడంతో ప్రిన్స్ అభిమానులు ఖుషీగా ఉన్నారు. స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తి కావడంతో, జనవరి నెలాఖరు నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.