ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తోన్న “స్పైడర్” సినిమా తుది దశకు చేరుకుంది. రెండు పాటలు, కొంత టాకీ పార్ట్ మినహా చిత్ర షూటింగ్ పూర్తి కావడంతో, తదుపరి సినిమా షెడ్యూల్స్ కు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. అయితే ఒక్క హీరోయిన్ ఎంపిక మాత్రం పెండింగ్ ఉందగా, తాజాగా దానిపై ఓ స్పష్టత వచ్చిందనేది ట్రేడ్ టాక్.

“భరత్ అనే నేను” టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రిన్స్ సరసన ‘లోఫర్’ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా ఎంపికైనట్లుగా తెలుస్తోంది. పూరీ వెలుగులోకి తెచ్చిన ఈ బ్యూటీ, జాకీ చాన్ తో ‘కుంగ్ ఫూ యోగా’ చిత్రంతో ఓ రేంజ్ లో సందడి చేసింది. ఈ సినిమా ప్రమోషన్ కోసం బీచ్ లలో బికినీ వీడియోలతో, ఫోటోలతో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసింది. అయినప్పటికీ బాలీవుడ్ లో ఆశించిన అవకాశాలను అందుకోవడంలో విఫలమైన దిశాకు కొరటాల శివ ఛాన్స్ ఇచ్చారనేది లేటెస్ట్ న్యూస్.

అయితే ఈ విషయాన్ని అధికారికంగా చిత్ర యూనిట్ డిక్లేర్ చేసేవరకు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే, ఈ సినిమాలో ప్రిన్స్ సరసన నటిస్తున్నారంటూ ఇప్పటికే చాలామంది బ్యూటీల పేర్లు హల్చల్ చేసాయి. అయితే మరో అవాక్కయ్యే విషయం ఏమిటంటే… ప్రిన్స్ మహేష్ బాబు సినిమాతో పాటు అల్లు అర్జున్ సినిమాలో నటించే ఛాన్స్ ను కూడా దిశా దక్కించుకుందని తెలుస్తోంది. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ తెరకెక్కిస్తున్న చిత్రంలో బన్నీ సరసన దిశాకు అవకాశం కల్పించారట. అయితే ఇందులో ఎంత వాస్తవముందనేది అఫిషియల్ ప్రకటన వచ్చిన తర్వాత తెలుస్తుంది.