Mahesh babu jr ntr Evaru Meelo Koteeswaruluఆదివారం నాడు మహేష్ బాబు – జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు లభించిన కిక్, బహుశా ఇటీవల కాలంలో ఏ హీరో అభిమానులకు కలిగి ఉండకపోవచ్చు. ఈ ఇద్దరు అగ్ర హీరోలు కలిసి ముచ్చటించుకుంటుంటే, చూడడానికి రెండు కళ్ళు సరిపోవన్నట్లుగా ఉంది. ఒకరిపై మరొకరు పంచ్ లు, సెటైర్లు… ఇలా కన్నులవిందైన వినోదాన్ని ఉల్లాసభరితంగా అందించారు.

ఈ ఎపిసోడ్ లో అభిమానులకు కావాల్సిన స్టఫ్ చాలా ఉంది. కానీ పబ్లిసిటీ విషయంలో సదరు టెలివిజన్ ఛానల్ ఇచ్చిన ప్రమోషన్స్ తో ఇద్దరు హీరోల అభిమానులు ఒకింత ఆగ్రహానికి గురయ్యారు. అయితే ఇదంతా ఎపిసోడ్ ముగిసిన తర్వాత విషయం! గంటన్నర్ర ఎపిసోడ్ లో ఉన్న హైలైట్స్ ను పక్కనపెట్టి, ఓ సాధారణ ప్రోమోలను కట్ చేయడంపై ఫ్యాన్స్ మండిపడ్డారు.

అలాగే ఈ ఎపిసోడ్ నడుమ వచ్చిన బ్రేక్స్ లో మరో ఎపిసోడ్ షూట్ చేసేయవచ్చు అన్న రీతిలో యాడ్స్ ను ప్రదర్శించడం కూడా అభిమానుల కోపానికి కారణమైంది. అయితే ఇవన్నీ కూడా మహేష్ – ఎన్టీఆర్ లు స్క్రీన్ పైన కనిపించనంత వరకే! ఒక్కసారి వీరిద్దరి ముచ్చట్లు ప్రారంభం అయిన తర్వాత అందరి కళ్ళు ఈ రెండు ‘స్టార్స్’ వైపే!

ఈ ‘పూనకాల ఎపిసోడ్’లో ఈ ఇద్దరు ఎలాంటి విశేషాలు చెప్పుకున్నారు అనేది వివరించడం కన్నా, వీక్షించడంలో ఉండే కిక్ మామూలుగా ఉండదు. నెయ్యిలో ఇడ్లీలు ముంచుకునే తినే జూనియర్ ఎన్టీఆర్ నుండి కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు క్యారెక్టర్ లో మహేష్ బాబు వరకు… అద్భుతంగా ఈ ఎపిసోడ్ పండింది. వీరిద్దరి నడుమ ఇంత బంధం ఉందని బహుశా ఇండస్ట్రీ వర్గాలకు కూడా ఇప్పుడే తెలిసిందేమో!

‘మహేష్ అన్నా’ అంటూ ఆప్యాయంగా జూనియర్ ఎన్టీఆర్ ఎపిసోడ్ ఆద్యంతం పలకడం ఈ ఎపిసోడ్ కే హైలైట్ గా నిలిచింది. ఆ పలుకులతో మురిసిపోవడం మహేష్ ఫ్యాన్స్ వంతయ్యింది. అలాగే ఒక షోను హోస్ట్ చేసేటంత టాలెంట్ నా దగ్గర లేదు, అది నీకే సొంతం అంటూ జూనియర్ ఎన్టీఆర్ పై సూపర్ స్టార్ చేసిన కామెంట్స్ కు ఫిదా కావడం యంగ్ టైగర్ ఫ్యాన్స్ వంతు!

అలాగే సంవత్సరంలో 365 రోజులలో 300 రోజులు ఎలా సాధ్యం అన్నా? కరోనా రాగానే మొదటగా గుర్తుకు వచ్చింది నువ్వే… అన్న జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యలకు, ఇలా మీ దిష్టి తగలడం వలనే రెండు సంవత్సరాలుగా ఎలాంటి టూర్స్ లేకుండా పోయాయి అన్న మహేష్ పంచ్… టెలివిజన్ చూస్తున్న వారందరినీ నవ్వులలో ముంచెత్తింది.

ఇంత అద్భుతంగా జరిగిన ఎపిసోడ్ లో కూడా ఫ్యాన్స్ ట్రోల్ కు ఓ అంశం గురయ్యింది. అదే ఫ్రెండ్ కు ఫోన్ చేయడం! ‘తాను అసలు ఈ సదుపాయాన్ని వాడుకోను నీకేమైనా ఇబ్బందా’ అంటూ పంచ్ వేసిన మహేష్ ఫ్రెండ్ లిస్ట్ లో తనతో పనిచేసిన దర్శకుల జాబితా ఉంది. ఇందులో వంశీ పైడిపల్లి పేరు కూడా ఉండడంతో, మహేష్ అభిమానులు ఈ అంశంపై పెద్ద ఎత్తున ట్రోల్ చేసారు.

‘మహర్షి’ సినిమా టైం నుండి వంశీ పైడిపల్లిపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఒకింత గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. అందులోనూ ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన ఫోటోలలో కూడా మహేష్ తో వంశీ టచ్ లో ఉన్నారని స్పష్టమైంది. దీంతో పైడిపల్లికే ఫోన్ చేస్తారని జరిగిన ట్రోలింగ్ కూడా సోషల్ మీడియాలో హాస్యాస్పందంగా మారింది. ఫైనల్ గా కొరటాలకు కనెక్ట్ చేయడంతో ఈ ట్రోల్ కు శుభంకార్డు పడింది.