Mahesh Babu Ignores spyder movie piracyసినీ ఇండస్ట్రీకి ఒకప్పుడు ‘పైరసీ’ అంటే పిచ్చ భయం ఉండేది. మహేష్ లాంటి స్టార్ హీరోలైతే ‘అర్జున్’ సినిమా విషయంలో ఒకడుగు ముందుకు వేసి షాప్ లో ఉన్న సిడిలన్నీ నడిరోడ్డుపై పడేసిన సందర్భాలున్నాయి. అంత సీరియస్ గా తీసుకున్న ‘పైరసీ’ ఇప్పుడు మరింత పెచ్చుమీరిందని చెప్పవచ్చు. అప్పట్లో ఒక వారానికి పైరసీ ప్రింట్ వస్తే, ప్రస్తుత రోజుల్లో ఫస్ట్ షో ముగిసిన వెంటనే ఆన్ లైన్ లో సినిమా దర్శనమిస్తోంది. కొన్ని సినిమాలకైతే విడుదలకు ముందే పైరసీ అయిన దాఖలాలు ఉన్నాయి.

ఇంత జరుగుతున్నా, ఇప్పుడు పైరసీపై ఎవరూ మాట్లాడడం లేదు. ఒకవేళ మాట్లాడినా దానిని సీరియస్ గా తీసుకోవడం లేదు. అంతదాకా ఎందుకు… ‘అర్జున్’ సినిమా పైరసీ విషయంలో చెలరేగిన మహేష్, తాజాగా ‘స్పైడర్’ లీక్ అయ్యిందని మీడియా వర్గాలు తెలిపినపుడు… ‘ఒకవేళ పొరపాటున అలా జరిగినా, అది చూస్తున్న ప్రేక్షకులు మళ్ళీ ధియేటర్ కు వచ్చి ఖచ్చితంగా చూస్తారన్న నమ్మకాన్ని వ్యక్తపరిచారు. ఇక్కడ మహేష్ కు తన సినిమాపై ఉన్న నమ్మకంతో పాటు పైరసీని చాలా ‘లైట్’గా తీసుకున్నట్లుగా అర్ధమవుతోంది.

ఒక్క మహేషే కాదు, ‘జై లవకుశ’ సినిమా విషయంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా పైరసీ గురించి అసలు ప్రస్తావించకపోవడం విశేషం. రెండవ రోజే ఆన్ లైన్ లో ప్రింట్ అందుబాటులోకి వచ్చినా, కనీసం దాని గురించి ఒక్క మాట మాట్లాడని జూనియర్, సినిమా ‘రివ్యూ’ల విషయంలో మాత్రం అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రివ్యూలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో మహేష్ బాబు కూడా స్పష్టంగా చెప్పారు. తాను రివ్యూలు చదువుతానని స్వయంగా ప్రిన్స్ చెప్పడం అనేది, సినిమా రివ్యూల ప్రాధాన్యతను మరింత పెంచిందని చెప్పవచ్చు.

ప్రస్తుత సినిమా పోకడ గమనిస్తే… ఒకప్పుడు ఏదైతే సినిమా ఇండస్ట్రీని నిలబడకుండా చేస్తోందని అందరూ గగ్గోలు పెట్టారో, ఇప్పుడు అసలు ఆ విషయాన్ని ప్రస్తావించడానికి కూడా తీరిక ఉండడం లేదు. ఆ స్థానంలోకి సినీ విశ్లేషకుల రివ్యూలు వచ్చి చేరాయన్న విషయం సుస్పష్టం. అంటే పరోక్షంగా ‘పైరసీ’ దారులకు ఈ హీరోలే అవకాశం కల్పించినట్లవుతోందా? లేక పైరసీని ఆపడం ఎవరి వల్లా కాదని సినీ హీరోలంతా చేతులెత్తేసారా? ఇదైతే కరెక్ట్ అనిపించక మానదు.