mahesh babu hilarious counter to bollywood reporterమీడియా మీట్ లలో జర్నలిస్ట్ లకు మహేష్ ఇచ్చే పంచ్ ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదేమో! చాలా సందర్భాలలో విలేఖరులు అడిగిన ప్రశ్నలు – మహేష్ చెప్పిన జవాబులు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. మహేష్ కామెడీ టైమింగ్ అలాంటిది అంటూ ఫ్యాన్స్ కూడా తెగ మురిసిపోయేవారు. ప్రస్తుతం కూడా అలాంటి ఓ జవాబే ఇచ్చారు మన సూపర్ స్టార్.

“నేను ముంబై నుండి వస్తున్నాను… హిందీ సినిమాలలో మిమ్మల్ని ఎప్పుడు చూడవచ్చు..” అంటూ ఓ విలేఖరి ప్రశ్నించగా, “మీరు ముంబై నుండి వచ్చారు గనుక మీ ప్రశ్నకు ఖచ్చితంగా బదులు చెప్తాను, నేను ప్రత్యేకంగా హిందీ సినిమాలు చేయాల్సిన అవసరం లేదు, తెలుగు సినిమాలు చేసి ప్రపంచమంతా తిరగొచ్చు, ప్రస్తుతం అదే జరుగుతోంది కూడా” అంటూ బదులిచ్చారు.

మహేష్ జవాబుకు చప్పట్లతో అభివాదాలు పలికారు ఆడిటోరియంలో ఉన్నవారంతా! ఓ యాప్ ప్రారంభ కార్యక్రమానికి విచ్చేసిన మహేష్ తో మీడియా చిట్ చాట్ నిర్వహించగా, ఈ సందర్భంగా వెలుగులోకి వచ్చిన ప్రశ్న ఇది, సమయస్ఫూర్తితో మహేష్ ఇచ్చిన జవాబు అది. ఈ సందర్భంగా మరికొన్ని ప్రశ్నలు కూడా మహేష్ ను చుట్టుముట్టాయి.

“ఆర్ఆర్ఆర్” చూసారు కదా, భవిష్యత్తులో మీరు ఎన్టీఆర్, చరణ్ లలో ఎవరితో చేయాలని అనుకుంటున్నారు అనగా, ఇద్దరితో అంటూ సమాధానం ఇచ్చారు. రాజమౌళితో సినిమా హాలీవుడ్ స్థాయిలో విడుదల చేస్తున్నారంట అని ఓ విలేఖరి అడుగగా, హాలీవుడ్ సినిమా ఏమో తెలియదు, తెలుగు సినిమా అయితే చేస్తున్నాము, నేను కూడా ఆసక్తికరంగా వేచిచూస్తున్నాను, కానీ ఇప్పుడే ఆ సినిమా గురించి మాట్లాడడం తగదంటూ సున్నితంగా చెప్పుకొచ్చారు.

‘తెలుగు సినిమా వెలిగిపోవాలి’ అన్నది మహేష్ ఆకాంక్ష. ఈ విషయం చాలా సందర్భాలలో చెప్పారు. అది ఏ సినిమా ద్వారా నెరవేరినా, దానిని అభినందించడంలోనూ, అలాగే తెలుగు సినిమా వైభవం గురించి ప్రస్తావించడంతో మహేష్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. గతంలో “బాహుబలి” సినిమా విషయంలో కూడా ఓపెన్ గానే మాట్లాడి, తెలుగు సినిమా ఖ్యాతి పెరిగినందుకు తనకు మిక్కిలి సంతోషంగా ఉందని అన్న వైనం తెలియనిది కాదు.