Mahesh Babu Fans tear theatre screen for Spyder benefit show విడుదలకు ముందు “స్పైడర్” సినిమా టికెట్లుకున్న క్రేజ్ తెలియనిది కాదు. దీనిని పూర్తి స్థాయిలో క్యాష్ చేసుకునేందుకు గుంటూరు జిల్లాలో ఓ ధియేటర్ యాజమాన్యం చేసిన ఓ ప్రయత్నం చివరికి ప్రిన్స్ అభిమానుల నుండి ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. “స్పైడర్” సినిమా బెనిఫిట్ షోను ప్రదర్శిస్తామని చెప్పి… ప్రిన్స్ అభిమానులకు ఒక్కో టికెట్ ను దాదాపుగా 500 రూపాయలకు అమ్మారు. అంత డబ్బులు పెట్టి కూడా టికెట్లు కొన్న అభిమానులకు ధియేటర్ యాజమాన్యం షాక్ ఇచ్చింది.

ఉదయం 6 గంటలకే ప్రసారం కావాల్సిన ఈ బెనిఫిట్ షోను, 10 గంటలకు ప్రదర్శిస్తామని చెప్పడంతో అభిమానుల ఆగ్రహం చెందారు. అందరి కంటే ముందుగా వేకువజామునే సినిమా చూడాలని 500 పెట్టి కొనుగోలు చేస్తే, దానిని రెగ్యులర్ షో మాదిరి ప్రదర్శిచడం ఏంటి అంటూ ధియేటర్ యాజమాన్యంపై మండిపడ్డారు. అంతేకాదు వారి ఆగ్రహానికి ధియేటర్ అద్దాలు బద్దలు కాగా, తెరను, సీట్లను కూడా ధ్వంసం చేసారు. అలాగే తమ దగ్గర నుండి వసూలు చేసిన ఎక్స్ ట్రా మొత్తాన్ని కూడా తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసారు.

గుంటూరు జిల్లా వినుకొండలో జరిగిన ఈ ఉదంతంలో… పరిస్థితి చేయి దాటిపోతుందన్న విషయం గమనించిన ధియేటర్ యాజమాన్యం, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగ ప్రవేశం చేసారు. అభిమానులను అదుపు చేస్తూ చర్యలు చేపట్టడంతో పరిస్థితి సర్దుమణిగింది. షోకు అనుమతి లేకుండా అభిమానుల నుండి ఎక్కువ మొత్తంలో వసూలు చేసిన డబ్బులకు పర్యవసానంగా ధియేటర్ ధ్వంసం కావడం విశేషం. ‘స్పైడర్’ క్రేజ్ ను క్యాష్ చేసుకుందామని చేసిన ప్రయత్నం చివరికి విఫలయత్నంగా మిగిలింది.