Mahesh Babu Fan Made Spyder Poster మురుగదాస్ – మహేష్ బాబుల “స్పైడర్” సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే తెలుగు, తమిళ భాషలలో సెన్సార్ పూర్తి కావడంతో, విడుదలకు గ్రీన్ సిగ్నల్ లభించిన ఈ సినిమా ప్రమోషన్స్ పై ప్రిన్స్ అభిమానగణం ఒకింత గుర్రుగా ఉన్న మాట వాస్తవమే. ఈ చిత్రాన్ని నిర్మించిన ఠాగూర్ మధు మరియు ప్రసాద్ లు ఆశించిన విధంగా ప్రమోషన్ కార్యక్రమాలను చేయడంలో విఫలం అవుతున్నారనేది ఫ్యాన్స్ మాట.

బహుశా అందుకేనేమో… చిత్ర యూనిట్ విడుదల చేసిన వాటి కంటే, తమ సొంత ప్రతిభతో పోస్టర్లను డిజైన్ చేసి, వారి పబ్లిసిటీ వారు చేస్తున్నారు. అందులో భాగంగా ఓ అభిమాని రూపొందించిన పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంటిలిజెన్స్ ఆఫీసులో ల్యాప్ టాప్ ను చూస్తూ ఉన్న ఈ పోస్టర్లో “స్పైడర్” టైటిల్ ను జోడించి విడుదల చేసారు. చిత్ర యూనిట్ విడుదల చేసిన ప్రమోషనల్ వీడియోలు పెద్దగా ఆకట్టుకోనప్పటికీ, ఈ సినిమాపై మహేష్ చేసిన వ్యాఖ్యలతో భారీ అంచనాలనే పెట్టుకున్నారు.

తెలుగులోనే కాక తమిళంలో కూడా భారీ స్థాయిలో విడుదల కానుండడంతో, అక్కడ కూడా భారీ ఓపెనింగ్స్ రావచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాదాపుగా 500 స్క్రీన్లపై తమిళ “స్పైడర్” ప్రత్యక్షం కానుంది. దర్శకుడిగా మురుగదాస్ కున్న క్రేజ్ తో పాటు మహేష్ అంటే భారీ అభిమానగణం ఉండడంతో, ఈ సినిమాతో తమిళనాడులో మంచి మార్కెట్ ను మహేష్ సృష్టించుకుంటాడని టాలీవుడ్ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి. అయితే కార్యరూపం సిద్ధించుకోవడానికి సరిగ్గా వారం రోజుల సమయం మాత్రమే ఉంది.