Mahesh Babu  donates 14 crores to adopted villageతెలంగాణలోని సిద్దాపూరును దత్తత తీసుకుంటున్నట్లు 2015 సెప్టెంబరు 20న ట్విటర్‌ ద్వారా మహేష్‌బాబు ప్రకటించారు. గ్రామం అభివృద్ధికి సుమారు రూ.14 కోట్ల వ్యయం అవుతుందన్న అంచనాతో పనులు చేపట్టారు. ఇప్పటికే 1.57 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు మహేష్‌బాబుకు చెందిన గ్రామం ఫౌండేషన్‌ తరఫున కొనసాగుతున్నాయి.

ఆయన రాకపోయినా గ్రామంలో ప్రగతి పరుగులు పెడుతోంది. ఈ గ్రామం బాధ్యతలన్నీ ఆయన భార్య నమ్రత చూసుకుంటున్నారు. రెండు సార్లు జరిగిన వైద్య శిబిరాల్లో ఆమె స్వయంగా పాల్గొన్నారు. బెంగళూరులోని ఓ పాఠశాల భవనం నమూనా ఆధారంగా అత్యాధునిక పాఠశాల భవనం నిర్మాణం జరుగుతుంది. తరగతి గదులు, కంప్యూటర్‌, సైన్స్‌ ల్యాబ్‌, లైబ్రరీ తదితర సౌకర్యాలు కల్పిస్తారు. ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ పాఠశాల నిర్మాణానికి 85 లక్షల కేటాయింపు చేసారు.

ఇప్పటివరకు 8.75 లక్షలతో అంగన్‌వాడీ భవన నిర్మాణం, 1.5 లక్షలతో సామాజిక మరుగుదొడ్ల నిర్మాణం, 2.5 లక్షలతో బస్‌షెల్టర్‌, 1.8 లక్షలతో ఉన్నత పాఠశాలలో రెండు డిజిటల్‌ క్లాస్‌రూమ్‌ల ఏర్పాటు చేసారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల తరువాత అంతర్గత రహదారులు, మురుగు కాలువల పనులు చేపడతారు. ఇవి పూర్తయితే గ్రామంలో ఉండాల్సిన మౌలిక సదుపాయాలన్నీ పూర్తవుతాయి.

ఇవి కాకుండా ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం నిర్మాణానికి 8 లక్షలు, ప్రాథమిక పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం, సామగ్రికి 23 లక్షలు, ఉన్నత పాఠశాలలో కంప్యూటర్‌ ల్యాబ్‌ కు 12 లక్షలు కేటాయింపులు చేసారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం సాక్షరభారత్‌ కింద ఎల్‌ఈడీ బల్పులు, సబ్బుల తయారీపై శిక్షణ ఇస్తున్నారు. మహేష్‌బాబు దత్తతతో సిద్ధాపూర్‌ రూపురేఖలే మారిపోతున్నాయి.