mahesh babu brother ramesh babu passes way2019లో విజయనిర్మల కాలం చేసిన తర్వాత మానసికంగా కృంగిపోయిన ఘట్టమనేని శివరామకృష్ణకు 2022 ప్రారంభంలో ఊహించని పరిణామం ఎదురయ్యింది. లివర్ ఇబ్బందులతో పెద్ద తనయుడు రమేష్ బాబు స్వర్గస్తులవ్వడం, ఓ తండ్రిగా జీర్ణించుకోలేని అంశం.

తన తనయుల కంటే ముందు తాను కాలం చేయాలని ఏ తండ్రైనా భావిస్తారు. అలాంటిది తాను ఉన్న సమయంలోనే రమేష్ ఇలా అర్ధాంతరంగా వెళ్లిపోవడం కృష్ణకు ఎనలేని శోకమే అని చెప్పవచ్చు. రెండేళ్ల వ్యవధిలో కృష్ణకు తగిలిన ఈ చేదు అనుభవం నుండి మళ్ళీ ఎలా కోలుకుంటారో అన్న ఆవేదన అభిమానులను పిండేస్తోంది.

రమేష్ మరణంలో మరో ట్విస్ట్ ఏమిటంటే… రమేష్ ను కడసారి చూసే అవకాశం కూడా మహేష్ బాబుకు లేకపోవడం. ఇతర హీరోలలా ఫ్యామిలీ గురించి మహేష్ బయటకు చెప్పరు గానీ, ఒకటి, రెండు సందర్భాలలో మాత్రం అన్నయ్య రమేష్ పట్ల ఎంత అభిమానం, ప్రేమ ఉందో వెల్లడించారు. అలాగే ఆర్ధికంగా రమేష్ కుటుంబానికి వెన్నుదన్నుగా ఉండేది కూడా మహేష్ బాబే.

రమేష్ బాబు ఫోన్ చేస్తే లేచి నిలబడి ఫోన్ మాట్లాడతాడని, అది ఒక అన్నయ్యగా రమేష్ కు మహేష్ బాబు ఇచ్చే గౌరవమని, అన్నయ్య అంటే అంత ఇష్టమని గతంలో శ్రీనువైట్ల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఎవరితోనూ సహజంగా మాట్లాడని రమేష్, తనతో 10 నిముషాలు మాట్లాడారని, నానిని చాలా బాగా చూపించారని ఈ ఇంటర్వ్యూలో శ్రీనువైట్ల తెలిపారు.

ఈ కష్టకాలంలో కరోనా పాజిటివ్ తో ఉన్న మహేష్ అందుబాటులో లేకపోవడం కుటుంబానికి మరో శోకం. అలాగే తన అన్నయ్యను చివరి సారిగా చూడకపోవడం కూడా మహేష్ కు జీర్ణించుకోలేని విషయం. గతేడాది కరోనా సమయంలో ఇలాంటి అనుభూతులే సామాన్యులకు అనేకం ఎదురయ్యాయి. కడసారి కుటుంబ సభ్యులను చూసుకునే అవకాశం లేకుండా పోయిన సంఘటనలు కోకొల్లలు.

కానీ సెలబ్రిటీ ఇంట ఇలాంటి వాటికి తావుండదు అని భావిస్తారు గానీ, ప్రస్తుతం ఘట్టమనేని కుటుంబ సభ్యుల ఆక్రోశం వర్ణణాతీతం. ఈ రోజు రమేష్ బాబు చివరి ప్రయాణం హైదరాబాద్ లో జరగనుంది. కరోనా నిబంధనలు రీత్యా అభిమానులు ఎవ్వరూ రావొద్దని ఇప్పటికే ఘట్టమనేని ఫ్యామిలీ ఓ ప్రకటన ఇచ్చారు. ఈ సందర్భంగా రమేష్ బాబు ఆత్మకు శాంతి చేకూరాలని, కల్మషం ఎరుగని కృష్ణ ఈ ఉదంతం నుండి త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం.