Mahesh Babu AMB Cinemas - paid GST fineకొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌ గచ్చిబౌలిలో సినీ హీరో మహేష్ బాబు కు చెందిన ఏఎంబీ సినిమాస్‌ మల్టీప్లెక్స్‌లో సినిమా టికెట్లపై జనవరి 1 నుంచి తగ్గించిన పన్ను రేట్లను తగ్గించకుండా గత పన్నురేట్లతోనే విక్రయిస్తున్నారని కేంద్ర జీఎస్టీ అధికారులు దాడులు చేసి కేసులునమోదు చేశారు. జనవరి 1 నుంచి ఈనెల 5 వరకు ఎక్కువ మొత్తం వసూలుచేసినట్లు అభియోగం. అయితే ఆ సమయంలో ఇందులో తమ తప్పు ఏమీ లేదని వాదించిన యాజమాన్యం మొత్తానికి దిగి వచ్చింది.

అధికంగా వసూలు చేసిన పన్నుమొత్తం రూ.35.66 లక్షలుగా పేర్కొనగా ఏఎంబీ సినిమాస్‌ యాజమాన్యం ఆ మొత్తాన్ని చెల్లించింది. సీజీఎస్టీ అధికారులు చట్టంప్రకారం ఈ మొత్తాన్ని వినియోగదారుల సంక్షేమ నిధికి జమ చేయనున్నారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలి లో ఉన్న ఈ మల్టీప్లెక్స్ భారీ స్క్రీన్‌తో పాటు.. 4D సౌండ్ సిస్టమ్‌తో సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని ఇస్తుంది. నగరంలోని అత్యంత ఖరీదైన మల్టీప్లెక్స్ ఇదే మరియు ఇక్కడే టిక్కెట్ల ఖరీదు ఎక్కువ కూడా.

టాక్స్ సంబంధిత వివాదాలు మహేష్ బాబు కు కొత్తేమీ కాదు. ఈ మధ్యనే ఆయన చేస్తున్న బ్రాండ్ ఎండార్స్మెంట్ల పై సర్వీసు టాక్స్ ఎగ్గొట్టారు అనే ఆరోపణలపై నోటీసులు అందుకున్నారు. మొదట్లో న్యాయ పోరాటం అన్నా తరువాత తప్పు ఒప్పుకుని అపరాధ రుసుము చెల్లించేశారు మహేష్ బాబు. చిన్న మొత్తాల కోసం అనవసరమైన వివాదాలలో తమ అభిమాన హీరో ఇరుక్కోవడం మహేష్ బాబు అభిమానులకు మింగుడు పడటం లేదు. మరోవైపు సూపర్ స్టార్ ప్రస్తుతం మహర్షి షూటింగులో బిజీగా ఉన్నారు. ఏప్రిల్ 25న ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది.