Mahesh babu about sitara character in brahmostavamబాలనటుడిగా ‘ఒమెగాస్టార్’ బిరుదును సొంతం చేసుకున్న సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు తెరంగ్రేటం ‘రాజకుమారుడు’ సినిమాతో జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రిన్స్… అనేక సినీ, వ్యక్తిగత విశేషాలతో పాటు తొలి సినిమా ‘రాజకుమారుడు’కు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

‘రాజకుమారుడు’ సినిమా కధ చెప్తున్న సమయంలో… తనకు ఆ కధ ఆసక్తి కలిగించకపోవడంతో… ఓ పక్కన రాఘవేంద్రరావు గారు చెప్తుంటే… మరో పక్కన తాను ఫోన్ లో గేమ్స్ ఆడుకుంటూ ఉన్నానని, అసలు ఆ కధే తను వినలేదని… మొత్తం అయిపోయిన తర్వాత నన్ను గమనించి… నీకు ఇష్టం లేకపోయినా అలా ప్రవర్తించమాకు… దర్శకులకు నమ్మకం పోతుంది…’ అని రాఘవేంద్రరావు చెప్పారని ప్రిన్స్ తెలిపారు.

అలాగే ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో కూడా… ఇలాంటి సీన్లను జనాలు చూస్తారా… మరీ… అని అంటుంటే… నన్ను నమ్ము… ఇలాంటివే వర్కౌట్ అవుతాయి… అని రాఘవేంద్రరావు గారు చెప్పారని, చివరికి ఆయన నిర్ణయమే కరెక్ట్ అయ్యిందని అన్నారు. అలాగే తానూ మొహమాటంతో చేసిన సినిమా ఒకటుందని… అది నాన్న కృష్ణ గారితో చేసిన ‘వంశీ’ సినిమా అని, మొహమాటంతో చేసినా అది తనకు మంచే చేసిందని, ఆ సినిమా ద్వారానే నమ్రత పరిచయం కావడం, పెళ్లి అవ్వడం జరిగాయని ప్రిన్స్ తన అనుభూతులు చెప్పుకొచ్చారు.

చిన్నప్పుడు చెన్నైలో ఉన్నపుడు తాను ఎక్కువగా ఆటోలలోనే తిరుగుతుండే వాడినని, అక్కడ దేవి ధియేటర్ సినిమాలకు అడ్డా అని, చాలా సార్లు లైన్ లో నిల్చుని టికెట్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయని, అందులో ఒకటి ‘రంగీలా’ సినిమా అని, అలాగే కమల్ హాసన్, రజనీకాంత్ సినిమాలు కూడా ఎక్కువగా చూసేవాడిని, ఏ సినిమా వచ్చిన దేవి ధియేటర్ లో ఫస్ట్ షో చూసేయాలి అన్నదే తన ఆలోచనగా ఉండేదని… సామాన్య జీవితం గడిపిన చిన్న నాటి చెన్నై కబుర్లు కూడా చెప్పారు ప్రిన్స్.

ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగిన ఈ కార్యక్రమం ప్రిన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. మరొక విధంగా చెప్పాలంటే… ‘బ్రహ్మోత్సవం’ సినిమా ఇచ్చిన నిరుత్సాహాన్ని ప్రిన్స్ ఫ్యాన్స్ ఈ కార్యక్రమంతో కొంత తీర్చేసుకున్నారని చెప్పవచ్చు. మొదటిసారిగా బుల్లితెరపై ఓ కార్యక్రమంలో పాల్గొనడంతో… ఒక్క ప్రిన్స్ అభిమానులే కాదు, సర్వత్రా ఈ కార్యక్రమం మంచి ఆదరణను చూరగొంది. ఈ కార్యక్రమం మరో హైలైట్ ప్రిన్స్ కూతురు సితార ‘రామ రామ’ పాటకు వేసిన స్టెప్స్ నిలిచాయి.