What-Delaying-Mahesh-Babu-to-Go-to-Shootఇంకా షూటింగ్ మొదలు కాని వంశీ పైడిపల్లి – ప్రిన్స్ మహేష్ బాబుల సినిమాకు సంబంధించిన స్టోరీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కధ ఇద్దరు స్నేహితులదని, అత్యంత కోటీశ్వరుడైన యువకుడిగా మహేష్ బాబు – అలాగే అత్యంత పేదరికం అనుభవించే వ్యక్తి అల్లరి నరేష్… ఇద్దరూ ప్రాణ స్నేహితులుగా నటించబోతున్నారని, దీనికి సంబంధించిన లైన్ హల్చల్ చేస్తోంది.

అగ్ర హీరోలకు సంబంధించిన కధలు ముందుగానే లీక్ కావడం అనేది ఆనవాయితీగా వస్తున్న నేపధ్యంలో… మహేష్ 25వ సినిమా కూడా ఇందుకు విరుద్ధంగా ఏమీ లేదు. ‘స్పైడర్’ సినిమా షూటింగ్ లో ఉండగానే, ‘భరత్ అనే నేను’ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రి పాత్రను పోషిస్తున్నారని వచ్చిన విషయం తెలిసిందే. తొలుత పుకారే అనుకున్నప్పటికీ, చివరికి అదే నిజమైంది.

బహుశా ఈ సినిమా స్టోరీ కూడా అదే అయ్యుండొచ్చు, కాకపోవచ్చు. కానీ ఇందులో మహేష్ – నరేష్ లు స్నేహితులుగా నటిస్తున్న విషయం అయితే గతంలోనే బయటకు వచ్చింది. జూన్ రెండవ వారం నుండి సెట్స్ పైకి వెళ్ళబోతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ డెహ్రాడూన్ లో జరగనుందని సమాచారం. మహేష్ కు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, దేవి స్వరాలు సమకూరుస్తున్నారు.