Little Girl's Surprise to Mahesh Babuహైదరాబాద్ లో నివశిస్తున్న టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు యుఎస్ఏలో నివశిస్తున్న ఓ చిన్నారి అభిమాని ఉత్తరం రాసింది. ఏంటి… పక్కన ఉన్న వ్యక్తికే వాట్సప్ సందేశం ఇచ్చే నేటి రోజుల్లో… యుఎస్ లో ఉండి ఉత్తరం రాయడం ఏంటి… అనుకుంటున్నారా? అవును… ఎవరైనా అలాగే ఆలోచిస్తారు. సామాన్యంగా అలా జరగదు కాబట్టే… మహేష్ బాబు కూడా ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ సదరు ఉత్తరాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

నేహా అనే ఓ ఆరేళ్ళ చిన్నారికి తన స్కూల్ లో ఇచ్చిన వర్క్ రీత్యా… తనకు ఇష్టం వచ్చిన సెలబ్రిటీకి లేఖ రాయాలని కోరగా, నేహా మహేష్ బాబుకు ఈ లేఖ రాసింది. ‘శ్రీమంతుడు’ తన ఫేవరేట్ సినిమా అని, ప్రతి సినిమా చూశానని, గౌతమ్, సితారలు చాలా క్యూట్ గా ఉన్నారని, మీ నుండి తిరుగు లేఖ అందితే చాలా గౌరవంగా ఫీల్ అవుతానని రాసిన లేఖను మహేష్ బాబు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ… నేను కూడా ప్రత్యూత్తరమే రాస్తానని స్పష్టం చేసారు.

బహుశా నేహాకు ఇష్టమైన ‘శ్రీమంతుడు’ సినిమాలోని థీమ్ నే మహేష్ బాబు కూడా ఫాలో అవుతున్నట్లున్నారు. అందుకే నేహ తనకు ఇచ్చిన మధురానుభూతులను తిరిగి నేహాకే ఇచ్చేయాలని, ప్రత్యూత్తరం రాస్తున్నారు. మహేష్ నుండి లేఖ అందుకోనున్న నేహా, తన స్కూల్ కే హాట్ టాపిక్ గా మారుతుందని చెప్పడంలో సందేహం లేదు. నేహా భవిష్యత్తు బాగుండాలని… దేవుని ఆశీస్సులు కోరుతూ… మహేష్ ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.