Mahesh Babu-1-Nenokkadine-DVD-Blue Ray2014 సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన “1 నేనొక్కడినే” సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రతికూల ఫలితాన్ని చవిచూసింది. అయితే క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా 14రీల్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు చాలా మంది అభిమానులే ఉన్నారు. కొత్తదనం, వినూత్నం కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా ‘ఫీస్ట్’ వంటిది కావడంతో… బాక్సాఫీస్ బరిలో నిలవలేకపోయినా… ఎంతో మంది ప్రేక్షకుల గుండెల్లో నిలిచింది.

అయితే ఈ సినిమాను మళ్ళీ మళ్ళీ వీక్షించే సౌకర్యం లేకుండా నిర్మాతలు ప్రిన్స్ అభిమానుల సహనాన్ని పరీక్షించారు. ఈ సినిమా డివిడి, బ్లూరేలు కావాలని ప్రిన్స్ అభిమానులు నిర్మాతలైన 14రీల్స్ ను సోషల్ మీడియా వేదికగా అడిగిన సందర్భాలు కోకొల్లలు. దాదాపుగా గత రెండేళ్ళ నుండి సాగుతున్న ఈ ప్రక్రియకు అతి త్వరలోనే తెరపడబోతోంది. తాజాగా ఈ సినిమా బ్లూరే, డివిడిలను విడుదల చేయనున్నట్లు ‘భవాని డివిడి’ యాజమాన్యం ఓ పోస్టర్ ను విడుదల చేసింది.

రాక్ స్టార్ గా ప్రిన్స్ అభినయం, అతని కెరీర్ లోనే ‘ది బెస్ట్’గా అభివర్ణించవచ్చు. ఒక్క షాట్ లో కూడా అలాంటి టిపికల్ క్యారెక్టర్ నుండి బయటకు వెళ్ళకుండా దాదాపు 3 గంటల సేపు ప్రిన్స్ ప్రదర్శించిన అభినయానికి అవార్డుల పరంగా తగినంత గుర్తింపు లేకున్నా, ప్రేక్షకుల హృదయాలలో మాత్రం చెరగని ముద్ర వేసారు. ఇక, సుకుమార్ ప్రతిభకు తార్కాణంగా నిలిచే ఈ సినిమాలో దర్శకుడు ఇచ్చిన ‘ట్విస్ట్’లకు విజ్ఞులంతా ‘హ్యాట్సాఫ్’ అన్నారు. రత్నవేలు అద్భుతమైన ఫోటోగ్రఫీ, దేవిశ్రీప్రసాద్ హంటింగ్ మ్యూజిక్… ఇలా అన్ని అంశాలలో అత్యున్నతమైన ప్రతిభను ప్రదర్శించిన ఈ సినిమా ప్రియులకు బ్లూరే, డివిడిల సమాచారం మిక్కిలి సంతోషదాయకం.