Dhoni, Dhoni Retirement, Mahendra Singh Dhoni Retirement, MS Dhoni Retirement, Dhoni One Day Retirement, Dhoni Test Cricket Retirementమహేంద్ర సింగ్ ధోని… ఇండియన్ క్రికెట్ లో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పేరు. టీమిండియాకు రెండు వరల్డ్ కప్ లు అందించిన ఘనత, టెస్టులు, వన్డేలలో జట్టును నెంబర్ 1 స్థానానికి చేర్చిన ఘనతను సొంతం చేసుకున్న వ్యక్తి ధోని. అయితే ఇదంతా గతం. కెప్టెన్ గా అద్భుతమైన రికార్డులను కైవసం చేసుకున్న ధోనికి గత కొన్ని సంవత్సరాలుగా కాలం కలిసి రావడం లేదు. ధోని సారధ్యంలో టెస్టు సిరీస్ లలో వరుస పరాజయాలు అవుతుంటే, మరో పక్కన కోహ్లి సారధ్యంలో అదే జట్టు విజయాలు సాధిస్తుంటే కూడా, ధోని అర్ధం కాకపోతే ఏం చేయాలి అంటూ తలలు పట్టుకోవడం ప్రేక్షకుల వంతవుతోంది.

ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ కు వెళితే… ధోని కెప్టెన్ గా ఉన్న సమయంలో నమోదైన సంచలన విజయాలు తెలియనివి కావు. అయితే అందుకు ప్రత్యక్షంగా ధోని మాత్రం కారణం కాదు. జట్టులో ఓపెనర్ సెహ్వాగ్ నుండి లోయర్ ఎండ్ లో ఉన్న బౌలర్స్ వరకు తమ స్థాయి ప్రతిభను చూపితే విజయాలు వశమయ్యాయి. అలాగని ధోని నేతృత్వాన్ని తక్కువ చేయలేం. జట్టును ఏకతాటిపైకి తెచ్చి ఇండియాకు సక్సెస్ రుచి ఏమిటో తెలియచెప్పాడు. అయితే ఇదే సమయంలో కొన్ని వివాదాస్పదమైన నిర్ణయాలకు కేంద్ర బిందువుగా మారారు ధోని.

అప్పటివరకు టీమిండియాకు అండదండలుగా ఉన్న లక్ష్మణ్, ద్రావిడ్ ల రిటైర్మెంట్ లలో ధోని వ్యవహారశైలి విమర్శలకు తావిచ్చింది. లెజెండరీ క్రికెటర్లకు సరైన వీడ్కోలు ఇవ్వలేదని, ధోని వలనే వారు జట్టుకు దూరం కావాల్సి వచ్చిందన్న విమర్శలు తలెత్తాయి. మరీ ముఖ్యంగా ధోని కెప్టెన్ గా ఉన్న సమయంలో సెహ్వాగ్ అందించిన విజయాలు మరపురానివి. ఒంటిచేత్తో టీమిండియా వైపుకు మలుపు తిప్పిన మ్యాచ్ లకు కొదవలేదు. అలాంటి సెహ్వాగ్ కు కూడా ధోని చుక్కలు చూపించారన్న విషయం అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేని విషయం.

అయితే కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ధోని వైపు నుండి ఆలోచిస్తే మాత్రం… ఫాంలో లేని వారు జట్టుకు దూరం కావాల్సిందే, అది ఎంతటి లెజెండరీ క్రికెటర్లు అయినా సరే… అన్న రీతిలో ముందుకెళ్ళారు. దేశానికి మించి వ్యక్తులు శాశ్వతం కాదు అనే ధోరణి మంచిదే. మరి అదే ధోరణి తనకు ఎందుకు వర్తింపచేసుకోవడం లేదు అన్న విషయాన్ని ధోని మననం చేసుకోవడం లేదు? అన్నదే క్రికెట్ ప్రేమికుల ఆవేదన. ప్రస్తుతం ధోని సారధ్యంలో అన్ని ఓటములే తప్ప విజయాలు అన్నది సాధ్యం కాని విషయంగా మారింది.

తాజాగా జరిగిన వెస్టీండీస్ రెండు టీ 20ల సిరీస్ లో మొదటి మ్యాచ్ లో ఒక పరుగు తేడాతో ఓటమి పాలు కాగా, రెండవ మ్యాచ్ లోనైనా విజయం సాధించి సిరీస్ సమం చేద్దామని భావించిన జట్టుకు ప్రకృతి కన్నెర్ర చేసింది. దీంతో విండీస్ చేతిలో సిరీస్ ఓటమి చవిచూసింది. దీన్ని బట్టి ధోని సువర్ణకాలం ముగిసిందనే సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు ధోని బ్యాటింగ్ తీరు మిక్కిలి అసంతృప్తిగా మారిపోయింది. తన యావరేజ్ ను మెరుగుపరుచుకోవడానికి సింగిల్స్, డబుల్స్ తీస్తూ ఓ 40, 50 పరుగులు చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు తప్ప, జట్టు లక్ష్యం దృష్ట్యా ఆడడం లేదన్న విమర్శలు ఊపందుకుంటున్నాయి.

ధోనికి ఉన్న ఏకైక ప్లస్ పాయింట్ కీపింగ్. ఈ విషయంలో ధోని నైపుణ్యం అద్భుతమనే చెప్పాలి. అయితే ప్రత్యామ్నాయంగా రాహుల్ రెడీ అవుతున్న నేపధ్యంలో ధోనికి ఈ భారం కూడా తగ్గనుంది. మహామహుల రిటైర్మెంట్ విషయంలో కీలక పాత్ర పోషించిన ధోని రిటైర్మెంట్ లో ఎవరు కీలక భూమిక పోషిస్తారు? ఇటీవల ఓ విదేశీ జర్నలిస్టు అడిగినపుడు ‘చమత్కారాలు’ ఆడిన ధోనికి… బహుశా ఇప్పుడైతే సదరు జర్నలిస్టు సరైన సమాధానం చెప్తారేమో..! ఇంకా ఎన్నాళ్ళ పాటు ధోని జట్టుకు భారంగా మారతారో చూడాలి.