Mahela Jayawardene In Race To Be Team India Coachప్రపంచ కప్ లో సెమీస్ నుండే నిష్క్రమించడం వల్లో ఎందుకో తెలిదుగాని భారత జట్టు సపోర్టు స్టాఫ్ ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తుంది బీసీసీఐ. ప్రధాన కోచ్‌ సహా బ్యాటింగ్‌ కోచ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌, బౌలింగ్‌ కోచ్‌, ఫిజియో థెరపిస్టు, అడ్మినిస్ట్రేటివ్‌ మేనేజర్‌ను తిరిగి నియమించుకోనుంది. జులై 30, సాయంత్రం ఐదు గంటల్లోగా ఆయా పదవులకు దరఖాస్తు చేసుకోవాలని బీసీసీఐ సూచించింది.

ఈసారి కొత్తగా వయసు, అనుభవం నిబంధనలు తీసుకొచ్చింది. అభ్యర్థులకు కనీసం రెండేళ్ల అంతర్జాతీయ అనుభవంతో పాటు 60 ఏళ్ల వయసు మించరాదని పేర్కొంది. ప్రస్తుతం కోచ్‌ పదవికి దరఖాస్తు చేసుకునేందుకు జయవర్థనే, టీమిండియా మాజీ కోచ్‌ గ్యారీ కిరెస్టన్‌, టామ్‌ మూడీ, వీరేంద్ర సెహ్వాగ్‌లు ఆసక్తిగా ఉన్నారని సమాచారం. వీరందరిలో జయవర్ధనే ముందంజే లో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి.

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు మహేలా జయవర్ధనే కోచ్‌గా ఎంపికైన తర్వాత జరిగిన మూడు ఎడిషన్లలో రెండుసార్లు ఆ జట్టు ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచింది. దీంతో పాటు ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలతో అతడికి మంచి సాన్నిహిత్యం ఉండటం కూడా కలిసొచ్చే అంశం. స్వదేశంలో అక్టోబరు లో దక్షిణాఫ్రికా జట్టుతో జరిగే సిరీస్ నాటికి కొత్త కోచ్ ను నియమించే దిశగా బీసీసీఐ అడుగులు వేస్తోంది.