Maharshi -Ticket Prices increaseమహర్షి సినిమా టికెట్ల ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖండించారు. టికెట్ల ధరల పెంపునకు ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్లను ఎప్పుడూ పెంచలేదని.. ఈ సినిమా విషయంలోనూ అదే వర్తిస్తుందని చెప్పారు. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

సింగిల్ స్క్రీన్ థియేటర్‌ టికెట్‌ను రూ.80 నుంచి రూ.110, మల్టీప్లెక్స్ టికెట్‌ను రూ.138 నుంచి రూ.200వరకు పెంచినట్టు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. అయితే ఇప్పటికే నెట్ లో బుకింగు ఓపెన్ చేసిన థియేటర్లు పెంచిన రేట్లకే టిక్కెట్లు అమ్మడం గమనార్హం. అయితే ప్రభుత్వ ఆదేశాలతో కాకుండా కోర్టు ఆదేశాలతో టిక్కెట్ల ధరలు పెంచినట్టు సమాచారం. గతంలో ఎప్పుడో కోర్టు ఇచ్చిన ఒక తీర్పు మహర్షికి ఏ మాత్రం సంబంధం లేకపోయినా దానిని ఆ సినిమాకి అన్వయించుకుని రేట్లు పెంచారని తెలుస్తుంది.

ఈ విషయంలో ఇప్పుడు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇది ఇలా ఉండగా సూపర్ స్టార్ మహేష్ బాబు-వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో తెరకెక్కిన మహర్షి సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్‌గా నటించింది. అల్లరి నరేష్‌ కీలక పాత్ర పోషించాడు. మహేష్ బాబు కెరీర్‌లో 25వ చిత్రం కావడంతో మహర్షిపై భారీ అంచనాలే ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ సినిమాకు రెండు వారల పాటు ఐదో షో వేసుకోవడానికి మాత్రం పర్మిషన్ ఇచ్చింది.