Maharshi 100 days ఒకప్పుడు సినిమాల విజయాన్ని అవి థియేటర్స్ లో ఆడిన రోజుల బట్టి అంచనా వేసే వారు. ఆ తరువాత ఆ రోజులు పోయాయి. ఆ సినిమా రాబట్టిన వసూళ్ళ బట్టి దానిని విజయాన్ని అంచనా వేస్తున్నారు. ఎక్కువ ఓపెనింగ్స్ కోసం భారీ రిలీజ్ పెడుతున్నారు. దానితో అసలు సినిమాకు రన్నింగ్ రావడం అనేది లేదు. 50 రోజులలోపే సినిమా అమెజాన్ ప్రైమ్ లో దర్శనం ఇవ్వడంతో అది మరింత కష్టమయ్యింది. ఈ తరుణంలో కూడా స్టార్ హీరోల అభిమానులు డబ్బులు ఖర్చుపెట్టి మరీ సినిమాలను ఆడిస్తున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సినిమా ఈరోజు 100 రోజులు పూర్తి చేసుకుంది. గాజువాక, చిలకలూరిపేట, అదోని లలో 100 రోజులు పూర్తి చేసుకుంది. అయితే ఇవన్నీ అభిమానులు డబ్బులు పెట్టి ఆడించినవే. హిట్ సినిమా కాబట్టి నాలుగు ఐదు వారాలు మహర్షి బాగా ఆడింది. ఆ తరువాత థియేటర్ల రెంట్లు కట్టి అభిమానులు ఆడించడమే. టీవీలో కూడా వేసేశాక, అమెజాన్ ప్రైమ్ లో వచ్చేశాక కూడా థియేటర్లకు వెళ్లి జనాలు సినిమా చూశారంటే నమ్మే విషయం కాదు.

మహర్షి సినిమా మహేష్ బాబు కేరీర్ లోనే అతిపెద్ద హిట్. అది ఆయన కేరీర్ లోనే మొదటి 100 కోట్ల సినిమా. తెలుగు ఇండస్ట్రీలో ఐదో అతిపెద్ద హిట్. అటువంటి సినిమాకు డబ్బులు పెట్టి థియేటర్లలో 100 రోజులు ఆడించడం ఆ సినిమాకే అవమానం. ఈ జాఢ్యం ఒక్క మహేష్ బాబు అభిమానులకే కాదు అందరి హీరోల అభిమానులకు ఉన్నదే. ముందుముందైనా ఈ సంస్కృతి పోవాలని కోరుకోవడం తప్ప చేసేది ఏమీ లేదు.