Maharashtra CM Devendra Fadnavisమహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ పెను ప్రమాదం నుండి బయట పడ్డారు. చివరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇదేమీ సాధారణ ప్రమాదం కాదు. నిజంగా ఈ సంఘటన చూసిన తర్వాత, సిఎంతో సహా మిగతా ముగ్గురు చిరంజీవులై తిరిగి వచ్చారంటే… నిజంగా భూమి మీద నూకలు ఉన్నాయన్న నానుడిని రుజువు చేసిన వారే.

ఫడ్నవీస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ కాగా, ఆపై తీసిన దృశ్యాల వీడియో మీడియా ఛానల్స్ లో, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ దృశ్యాల్లో హెలికాప్టర్ రెక్కలన్నీ విరిగిపోయి, రెండు తలుపులు పూర్తిగా ధ్వంసం అయినట్లు కనిపిస్తున్నాయి. క్రాష్ ల్యాండింగ్ అయిన ప్రాంతానికి కేవలం ఐదారు మీటర్ల దూరంలోనే నివాస గృహాలు, ఓ ట్రాన్స్ ఫార్మర్, విద్యుత్ వైర్లు ఉన్నాయి. చాపర్ రెక్కలు పక్కనున్న రేకుల షెడ్ గోడకు తగిలి విరిగిపోయాయి. వీటి ధాటికి పక్కనే ఉన్న ఓ లారీ అద్దాలు పగిలిపోయాయి.

చాపర్ తోకకు ఉండే ఫ్యాన్ పూర్తిగా ధ్వంసమైంది. బేస్ దెబ్బతింది. హెలికాప్టర్ అద్దాలు పగిలిపోయాయి. అయితే, హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ చివరి క్షణంలోనే ఇదంతా జరగడం, ఆపై అది కేవలం ఒకటి, రెండు మీటర్ల ఎత్తు నుంచే కింద నిట్టనిలువుగా పడటంతోనే అందులోని వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఏది ఏమైనా పెను ప్రమాదం నుంచి ఫడ్నవీస్ క్షేమంగా బయటపడటం చెప్పుకోదగ్గ విషయమే. నిజానికి ఈ వీడియో చూసిన తర్వాత ఆ నలుగురు ఎలా బ్రతికారు? అన్న ప్రశ్న తలెత్తడం సహజం.