mahanubhavudu Audio Vs SPyder Jai Lava Kusaఈ దసరాకు రెండు పెద్ద సినిమాలతో పాటు శర్వానంద్ – మారుతీల “మహానుభావుడు” సినిమా కూడా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతికి “ఖైదీ నంబర్ 150” మరియు “గౌతమీపుత్ర శాతకర్ణి” మధ్య విడుదలై “శతమానం భవతి” ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న ట్రాక్ రికార్డ్ శర్వానంద్ కు ఉండడంతో, మారుతీ దర్శకత్వం వహిస్తోన్న ఈ “మహానుభావుడు” సినిమాపై పాజిటివ్ టాక్ నెలకొంది. అందుకు అనుగుణంగానే విడుదలైన ఈ సినిమా ఆడియో అదరగొడుతోంది.

ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు శ్రోతలను ఆకట్టుకోవడంలో విజయవంతం అయ్యాయి. రెండు పెద్ద సినిమాలు “జై లవకుశ, స్పైడర్”లు ఏ విషయంలో అయితే ప్రేక్షకుల నుండి నెగటివ్ టాక్ ను సొంతం చేసుకున్నాయో, అదే అంశంలో “మహానుభావుడు” పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని, ఫస్ట్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తం ఆరు పాటలున్న ఈ ఆల్బమ్ లో అన్ని పాటలు వినసొంపుగా ఉండడం ఊహించని పరిణామం. అది కూడా థమన్ సంగీతం నుండి..!

అయితే పెద్ద సినిమాలకు, చిన్న సినిమాలకు ఉన్న వ్యత్యాసం ఏమిటంటే… ఆ రెండు సినిమాల పాటలు అదిరిపోతాయి అని ముందుగానే అంచనాలు పెట్టుకుని వినడం వలన, వాటిని రీచ్ కాలేకపోయాయి. కానీ ‘మహానుభావుడు’ ఆడియోపై ఎలాంటి అంచనాలు లేవు. దీంతో యావరేజ్ సాంగ్స్ అయినా కూడా ఈ పోటీ వాతావరణంలో పడి ‘ఎక్స్ ట్రార్డనరీ’గా మారిపోయాయి. బహుశా ఇవే సాంగ్స్ ‘జై లవకుశ’కో లేక ‘స్పైడర్’కో ఇస్తే… వీటి పరిస్థితి అంతే! కానీ ఎలా చూసుకున్నా… ఆ రెండు సినిమాల ఆల్బమ్స్ కంటే ‘మహానుభావుడు’ సినిమాదే ఆధిపత్యం..!