It Is Not Yet Over For Mahanubhavudu ఈ దసరా పండగ సినీ అభిమానులను పూర్తిగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాలు పెట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ “జై లవకుశ” అంతంతమాత్రంగానే ఉండగా, మహేష్ బాబు అభిమానులను మురుగదాస్ నట్టేట ముంచేసాడు. ఇక అంచనాలు లేని శర్వానంద్ “మహానుభావుడు” సక్సెస్ కొట్టగా… మొత్తంగా సినీ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అయితే పంచలేకపోయింది. దీంతో ఈ దసరా పర్వదినం ప్రేక్షకులకు కావాల్సిన ‘కిక్’నైతే ఇవ్వలేకపోయింది.

దీంతో ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు మంచి సినిమాల కోసం నిరీక్షిస్తున్నారు. ఈ వారం కూడా ఎలాంటి సినిమాలు లేకపోవడంతో ధియేటర్లు వెలవెలబోతున్నాయి. ఈ వారం మూడు చిన్న సినిమాలు “నేను కిడ్నాప్ అయ్యాను, ఓయ్ నిన్నే, లావణ్య విత్ లవ్ బాయ్స్” విడుదల అవుతుండగా, ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకులకు పరిచయం లేకపోవడం విశేషం. దీంతో గత వారం విడుదలైన “మహానుభావుడు” ఒక్కటే అభిమానులకు దిక్కయ్యింది. ఈ ప్రభావం వలనే రెండవ వారంలో మరో 100 ధియేటర్లు ఈ సినిమాకు తోడవ్వడం విశేషం.

అగ్ర హీరోలతో నిమిత్తం లేకుండా “మంచి సినిమాలు” అందిస్తే… సినిమాను ఏ రేంజ్ కు తీసుకెళ్తామన్నది “మహానుభావుడు” సినిమాతో ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. క్రేజీ కాంబోలు, మల్టిపుల్ రోల్స్… ఇలా మూసధోరణితో కధలకు కాకుండా, నావల్టీతో కూడిన కొత్త కధలకే ప్రేక్షకుల ఓటు అన్నది అయితే స్పష్టం. దీంతో ఇక నుండి మొదలుపెట్టే సినిమాల విషయంలో అయినా… అగ్ర హీరోలు, దర్శక నిర్మాతలు ఈ దిశగా ఆలోచించి, తెలుగు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించాలని ఆశిద్దాం.