Mahanati - public talkతెలుగు తెర ఇలవేల్పుగా కొనియాడే సావిత్రి జీవితగాధతో తెరకెక్కిన “మహానటి” సినిమాకు ప్రేక్షకుల నుండి అపూర్వ స్పందన లభిస్తోంది. నిజానికి ఈ సినిమాపై ఇంత క్రేజ్ ఉంటుందని ట్రేడ్ వర్గాలు కూడా భావించలేదు. ముందుతరం నటీమణి కావడంతో, ఒక వర్గం ప్రేక్షకులకే “మహానటి” పరిమితం అవుతుందేమోనన్న సందేహాలు సర్వత్రా నెలకొన్న నేపధ్యంలో, అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ సిల్వర్ స్క్రీన్ పై ‘మహానటి’ వెలిగిపోతోంది.

ఏపీ, తెలంగాణాలలో మాత్రమే కాదు, యుఎస్ లోనూ “మహానటి”కి వస్తున్న స్పందన అంచనాలు వేసింది కాదు. ఒక్క ప్రీమియర్స్ కే భారీ ఎత్తున జనాలు తరలి రావడం సావిత్రిపై ఉన్న గౌరవాన్ని, అభిమానాన్ని సూచిస్తుంది. ప్రీమియర్ కలెక్షన్స్ అయితే ఇటీవల విడుదలైన ఓ అగ్ర హీరో సినిమాతో పోటీపడేలా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇంతకంటే సంతోషించాల్సిన విషయం ఏమిటంటే… ఈ సినిమాకు పాజిటివ్ టాక్ బయటకు రావడం!

అవును… సావిత్రి సూసైడ్ చేసుకునే సీన్ నుండి సమంతతో ఎండ్ అయిన చివరి సీన్ వరకు “మహానటి” జీవితగాధను దర్శకుడు నాగ్ అశ్విన్ అద్భుతంగా తెరకెక్కించారని విమర్శకులు కూడా కితాబిస్తున్నారు. ఇక సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ ఇంత అభినయం ప్రదర్శిస్తుందనేది కూడా ఓ రకంగా షాకింగే! గ్లామర్ డాల్ గా సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన ఈ ‘శైలజ,’ ప్రతి సన్నివేశంలోనూ సావిత్రిని తలపించే విధంగా అభినయాన్ని ప్రదర్శించి ప్రశంసలు కొట్టేసింది.

ఈ సమ్మర్ లో విడుదలైన మూడు సినిమాలతో ధియేటర్ల వద్ద ప్రేక్షకుల హంగామా ముగిసిపోతుందేమోనని భావించిన వారికి “మహానటి” గట్టి షాక్ ఇచ్చింది. ఫస్ట్ షో నుండి పాజిటివ్ టాక్ తో వెలువడిన ఈ సినిమా ఏ రేంజ్ కు వెళ్తుందోనని సినీ జనాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. మొత్తానికి “మహానటి” ప్రేక్షకుల నీరాజనాలు అనేది ఖాయమైంది! ఈ సమ్మర్ స్పెషాలిటీ ఏమిటంటే… ఆయా సినిమాలలోని ప్రధాన తారాగణం అందరూ వారి వారి అత్యుత్తమ ప్రదర్శనలు ఇవ్వడం!