mahanati-box-office-collectionsఈ ఏడాది ఓపెనింగ్ టాలీవుడ్ కు చేదు అనుభవాలను మిగిల్చిన విషయం తెలిసిందే. సంక్రాంతి భారీ సినిమాలు ఒక్కటి కూడా బాక్సాఫీస్ వద్ద నిలవకపోవడంతో, ఈ ఏడాది తెలుగు చిత్రసీమకు ఎలా ఉంటుందో అన్న సందేహాలు తలెత్తాయి. ‘మూస’ నుండి ‘కంటెంట్’ వైపుకు టాలీవుడ్ పరివర్తనం చెందుతున్న రోజులు కావడంతో, ఈ సినిమాల విజయాలు అత్యవసరం. అందుకు తగ్గట్లుగానే ఈ ఏడాది మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ అదిరిపోతోంది.

‘రంగస్థలం’తో ప్రారంభమైన ఈ ఊపును ‘భరత్ అనే నేను’ కొనసాగించగా, ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ‘నా పేరు సూర్య’ ఓకే అనిపించుకునే వసూళ్ళను సంపాదించుకుంది. అయితే అయిదు రోజులకే ‘నా పేరు సూర్య’ వైఫల్యాన్ని మైమరిపించే విధంగా “మహానటి” బాక్సాఫీస్ ను రూల్ చేస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా ఏపీ, తెలంగాణాలతో పాటు యుఎస్ లోనూ కనకవర్షం కురిపిస్తోంది. దీంతో టాలీవుడ్ ఖాతాలో మరో భారీ విజయం చేరినట్లయ్యింది.

కొద్ది గ్యాప్ లో ఇలా మూడు విజయాలు సొంతం చేసుకోవడం అనేది గతేడాది సంక్రాంతి సీజన్ లో సాధ్యపడింది. అయితే ఆ తర్వాత ట్రాక్ కోల్పోయిన టాలీవుడ్, మళ్ళీ ఈ ఏడాది మిడిల్ ఆర్డర్ లో దున్నేస్తోంది. ఇదే ఒరవడిని “టాక్సీవాలా, ఆఫీసర్, రాజుగాడు” వంటి చిన్న, పెద్ద సినిమాలు కూడా లోయర్ ఎండింగ్ వరకు ఈ ఊపును కొనసాగించాలని ఆశిద్దాం. టాలీవుడ్ లో నమోదవుతున్న వరుస ‘కంటెంట్’ సక్సెస్ లతో ప్రస్తుతం అన్ని సినీ ఇండస్ట్రీల ప్రముఖులు ఇటు వైపుకు చూసే పరిస్థితి నెలకొంది.