Mahaa News Journalist Murthy Challenges- Pawan Kalyan Kapu Controversy -కాపు సామాజిక వర్గపు బిగ్ షాట్స్ ను క్రోడీకరించి, ఇటీవల కాకతీయ హోటల్ లో ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ ఓ రహస్య సమాచారం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే సదరు అంశాన్ని జర్నలిస్ట్ మూర్తి సంచలనంగా ఓ మీడియా ఛానల్ ప్రసారం చేస్తున్న తరుణంలో… మధ్యలోనే ఆగిపోవడం విశేషం. పవన్ కు భయపడే తోకముడుచుకుని వెళ్లిపోయారంటూ, పవన్ అభిమానులు సోషల్ మీడియాలో మూర్తిని ట్రోలింగ్ చేయడంతో, బయటకు వచ్చిన మూర్తి ఓ వెబ్ మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

సదరు మీడియా ఛానల్ కున్న కొన్ని పరిమితుల రీత్యా, పవన్ కళ్యాణ్ పై ప్రసారం అవుతున్న కధనం మధ్యలోనే ఆగిపోయిందని, దీంతో ఆ క్షణంలో తాను రాజీనామా సమర్పించి వచ్చేసాను తప్ప, ఎవరికీ భయపడి కాదని స్పష్టం చేసారు. రాజీనామా లేఖను ఎప్పుడు జేబులో పెట్టుకుని తిరిగే తాను ఎప్పుడూ ఎవరికీ భయపడింది లేదని, అయినా తాటాకు చప్పుళ్ళకు, ఉడత అరుపులకు నేను భయపడతానా? అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

అయినా నాడు తాను ప్రసారం చేసిన వాటిలో మూడు ప్రధానమైన అంశాలు ఉన్నాయని… ఒకటి, అది సీక్రెట్ మీటింగ్… రెండు, కేవలం కాపు సామాజిక వర్గంతోనే ఏర్పాటు చేసుకున్న సమావేశం…. మూడు, ఫండ్ కలెక్షన్… ఇవేమీ నిజాలు కాదని చెప్పమనండి, అవసరమైతే మీ 99 ఛానల్ కే వస్తాను, ఎలాంటి చర్చకైనా తాను సిద్ధం… అంటూ మూర్తి సవాల్ విసిరారు. నిజానికి ఆ సమావేశం 7వ తేదీన ఆవాస్ హోటల్ లో జరగాల్సి ఉందని, సదరు సమాచారం మీడియాకు లీక్ కావడంతో, అప్పటికప్పుడు సమావేశాన్ని వాయిదా వేసారని చెప్పుకొచ్చారు.

ఈ సమాచారం అంతా తన వద్ద ఉందని, వాట్సప్ ద్వారా పంపిన సందేశాలు తన వద్ద ఉన్నాయంటూ చెప్పుకొచ్చిన మూర్తి, సదరు ఛానల్ లో అప్పటికప్పుడు రిజైన్ చేయడం వలన, మరో ఫ్లాట్ ఫాం దొరకక ఈ నాలుగు రోజులు తన భావాలను వ్యక్తపరచలేదని స్పష్టం చేసారు. ప్రశ్నించడానికి పుట్టిన జనసేనను తాను ప్రశ్నించానే తప్ప, పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలనుకుంటే, ఆ సమావేశంలో పవన్ చేసిన ప్రసంగాలను నేరుగా ప్రసారం చేసేవాడినని, తన వద్ద అన్ని వీడియోలు ఉన్నాయని మరిన్ని సంచలన విషయాలు తెలిపారు.