Magunta-Sreenivasulu-Reddyఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్ర రెడ్డిని ఈడీ అరెస్ట్ చేసి చాలా రోజులే అయ్యింది. ఇప్పుడు మరో వైసీపీ ఎంపీ, ప్రముఖ మద్యం వ్యాపారి మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరుని కూడా ఈడీ నిన్న కోర్టుకి సమర్పించిన నివేదికలో పేర్కొంది. మాగుంట, శరత్ చంద్ర రెడ్డి, కల్వకుంట్ల కవితలతో కూడిన సౌత్ గ్రూప్ ఆధ్వర్యంలోనే ఈ కుంభకోణం జరిగిందని ఈడీ నివేదికలో పేర్కొంది.

దీనిపై మీడియా ప్రతినిధులు నేడు ఎంపీ మాగుంటని ప్రశ్నించగా ఆయన చాలా విచిత్రమైన సమాధానం చెప్పారు. “గతంలో కూడా ఈ కేసుతో నాకు సంబందం ఉందన్నట్లు వార్తలు వచ్చినప్పుడు నేను ప్రెస్‌మీట్‌ పెట్టి వివరణ ఇచ్చాను. ఈ కేసుతో నాకు ఎటువంటి సంబందమూ లేదని అప్పుడే చెప్పాను. అయినా మళ్ళీ నాపై ఆరోపణలు వచ్చినందున ఓ ఎంపీగా నేను ప్రజలకు జవాబు చెప్పుకోవలసిన బాధ్యత నాపై ఉంది. త్వరలో ఒంగోలులోనే ప్రెస్‌మీట్‌ పెట్టి అన్నీ వివరిస్తాను. అంహవరకు ఓపిక పట్టండి.

మాకు అసలు ఢిల్లీలో మద్యం వ్యాపారాలే లేవు. కానీ గుర్గావ్‌కి చెందిన అమిత్‌ అరోరా అనే ఓ వ్యాపారి నా పేరు చెప్పారని వార్తల్లో చూశాను. కానీ నేను ఏనాడూ ఆయనని కలవలేదు. కనీసం చూడలేదు. ఉత్తరాది మద్యం వ్యాపారులు నావంటి దక్షిణాది మద్యం వ్యాపారులను దెబ్బ తీయడానికి చేస్తున్న కుట్రలా ఉంది. నేను ఎటువంటి తప్పు చేయలేదు. ఆ కేసుతో నాకు సంబందమే లేదు. కనుక నేనెందుకు భయపడతాను?ఢిల్లీలో నాకు తెలిసిన వారిద్వారా ఈ కేసుకి సంబందించి పూర్తి వివరాలు తెలుసుకొని త్వరలోనే ప్రెస్‌మీట్‌ పెట్టి అన్నీ వివరిస్తాను,” అని చెప్పారు.

అయితే నిప్పు లేనిదే పొగరాదన్నట్లు దశాబ్ధాలుగా మద్యం వ్యాపారం చేస్తున్న మాగుంటకి ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో ఎటువంటి సంబందం లేకుండానే ఈడీ అధికారులు ఆయన పేరుని రిమాండ్ రిపోర్టులో చేరుస్తారా?మాగుంట ఎవరో తెలియకుండానే ఎక్కడో గుర్గావ్‌లో ఉన్న అమిత్ అరోరా ఆయన పేరు ప్రస్తావించారా? అయినా ఢిల్లీలో మాగుంట మద్యం వ్యాపారం చేయడంలేదన్నప్పుడు అక్కడి మద్యం వ్యాపారులు దక్షిణాదిన మద్యం వ్యాపారాలు చేసుకొంటున్న ఆయన మీద ఎందుకు కక్ష కడతారు?వారికి ఆ అవసరం ఏమిటి?అని ఆలోచిస్తే మాగుంటకి దీంతో సంబందం ఉండే ఉండవచ్చని అర్దం అవుతోంది.

ఈ కేసులో నిందితులుగా పేర్కొనబడుతున్న కల్వకుంట్ల కవితతో సహా అందరూ తమకు దీంతో ఎటువంటి సంబందమూ లేదని, తాము నిరపరాధులమనే చెపుతున్నారు. అందరూ పూలు కడిగిన ముత్యాలే అయితే మరి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ ఎవరు చేసినట్లు?