Maganti Murali Mohan to resign from active politicsఎన్నికల్లో తాను ఇక పోటీ చేయలేనని రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్.. సీఎం చంద్రబాబుకు స్వయంగా తెలిపారని వార్తలు వస్తున్నాయి. ఒకదశలో ఆయన కోడలు పోటీ చేస్తారని ప్రచారం జరిగినా ఇప్పుడు ఆ ప్రయత్నం కూడా మానుకున్నారని తెలుస్తుంది. 2009 ఎన్నికల్లో రాజమహేంద్రవరం నుంచి ఆయన తొలిసారిగా తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అతి స్వల్ప ఓట్ల తేడాతో ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు.

అయినప్పటికీ తరువాత ఆయన నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక సేవాకార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ప్రజల ఆదరాభిమానాలను పొందారు. 2014 లో గెలిచిన తరువాత నియోజకవర్గంలోని చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన చొరవ చూపారు. సైన్స్ మ్యూజియం, నర్సరీ రైతుల ఉచిత కరెంట్, విమానాశ్రయ అభివృద్ధి, రైల్వే ప్లాట్‌ఫామ్‌ల అభివృద్ధి, ఐదు ఫ్లైఓవర్‌లు మంజూరు చేయించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇంకా అనేక అభివృద్ధి పనుల్లో ఆయన ముందంజలో ఉన్నారు.

కాకపోతే ఆయన నియోజకవర్గంలో పెద్దగా అందుబాటులో ఉండరనే విమర్శలు వచ్చాయి. క్యాడర్ కు చిన్న చిన్న పనులు కూడా చేసి పెట్టరని, దీనితో పార్టీ నెమ్మదించింది అని వార్తలు వచ్చాయి. అయితే ఆయనతో ఉండే సాన్నిహిత్యం వల్ల సీఎం చంద్రబాబు ఆయనను మందలించలేకపోయారు. అధినేత మనసులో మాటను గ్రహించి ఆయనే తప్పుకున్నారట. శశి విద్యాసంస్థల చైర్మన్ బూరుగుపల్లి గోపాలకృష్ణ, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గుడా చైర్మన్ గన్ని కృష్ణ పేర్లు తాజాగా రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిగా వినిపిస్తున్నాయి.