High-Court-quashes-lawsuit-against-Dhanushసూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు, తమిళ స్టార్ హీరో ధనుష్ కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. ధనుష్ తమ బిడ్డేనని, తప్పిపోయాడని, ఇప్పుడు అతన్నుంచి తమ పోషణ నిమిత్తం నెలకు కొంత డబ్బు ఇప్పించాలని కదిరేశన్, మీనాక్షి దంపతులు వేసిన పిటిషన్ ను కోర్టు ఫైనల్ గా కొట్టివేసింది. ఈ కేసు విచారణలో దశలో ధనుష్ తన శరీరంపై ఉన్న పుట్టు మచ్చలను చెరిపేశారని డాక్టర్లు నివేదిక ఇవ్వడంతో కలకలం రేగడంతో, ఎలాంటి తీర్పు వస్తుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

దీంతో ధనుష్ ఇబ్బందుల్లో పడక తప్పదనే వాదనలు కూడా వినిపించాయి. మరోవైపు డీఎన్ఏ టెస్టుకు ధనుష్ అంగీకరించకపోవడం కూడా మరింత ఆసక్తిని కలిగించేలా చేసాయి. దీంతో చివరికి కోర్టు ఎవరికి అనుకూలంగా తీర్పు వస్తుందో అని భావించగా, తాజాగా మద్రాస్ హైకోర్టు కదిరేశన్ దంపతుల పిటిషన్ ను కొట్టివేస్తూ… సంచలన నిర్ణయాన్ని వెలువరించింది. అయితే ఏఏ కారణాలు చూపుతూ కదిరేశన్ దంపతుల పిటిషన్ ను కోర్టు కొట్టేశారన్న విషయాలు తెలియాల్సి వుంది.

నిజానికి ధనుష్ కు అనుకూలంగా తీర్పు వస్తుందని అయితే ఎవరూ ఊహించినది కాదు. డీఎన్ఏ టెస్ట్ కు అంగీకరించకపోవడం, లేజర్ సర్జరీ ద్వారా మచ్చలను చెరిపివేసారన్న డాక్టర్ల నివేదిక ఇవ్వడం, తదితర పరిణామాలతో ధనుష్ కు షాక్ ఇచ్చే విధంగా తీర్పు ఉంటుందని కోలీవుడ్ నాట కూడా భారీ ప్రచారం జరిగింది. కానీ, కోర్టు నుండి వచ్చిన తీర్పుతో బహుశా ధనుష్ కూడా అవాక్కై ఉంటారని చెప్పవచ్చు. మొత్తానికి గత కొన్ని నెలలుగా ధనుష్ కు మానసిక వేదనను మిగిల్చిన ఈ ఉదంతానికి శుభం కార్డు పడింది.