Maddula Srinivas Reddy, Maddula Srinivas Reddy Back TDP, Maddula Srinivas Reddy Left TRS, Maddula Srinivas Reddy Joins TDP, Maddula Srinivas Reddy TS-TDPతెలంగాణలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా విపక్షాలకు చెందిన టీడీపీ, కాంగ్రెస్ నేతలు అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 15 మంది ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ ఉన్న టీడీపీ… ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న పార్టీగా మిగిలిపోయింది. మల్కాజిగిరి లోక్ సభ స్థానం నుంచి గెలిచిన టిడిపి నేత మల్లారెడ్డి కూడా కారెక్కేయగా, మల్లారెడ్డికి కుడిభుజంలా వ్యవహరించిన ఆయన బావమరిది గుండ్లపోచంపల్లి మాజీ సర్పంచ్ మద్దుల శ్రీనివాస్ రెడ్డి కూడా తన బావ వెంటే గులాబీ గూటికి చేరారు.

అయితే మద్దుల టీఆర్ఎస్ లో ఇమడలేకపోయారు. తన బావ మల్లారెడ్డి టీఆర్ఎస్ నేతలతో బాగానే కలిసిపోయినా… మద్దుల మాత్రం టీఆర్ఎస్ కార్యక్రమాలతో అంటీముట్టనట్టుగానే వ్యవహరించారు. తాజాగా టీఆర్ఎస్ లో ఇక ఇమడలేనని తేల్చుకున్న మద్దుల… మళ్లీ తన సొంత గూడు టీడీపీ వైపు చూశారు. టీ టీడీపీ పెద్దలతో మంతనాలు సాగించారు. ఈ క్రమంలో మద్దుల రీఎంట్రీకి టీ టీడీపీ చీఫ్ ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో తన సొంత గూడుకు చేరుతున్నారు.

మేడ్చల్ నుంచి భారీ అనుచర గణంతో బయలుదేరనున్న మద్దుల… పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో రమణ, రేవంత్ రెడ్డిల సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. మద్దుల వెంట సొంతూరుకు చెందిన వారే కాకుండా… శామీర్ పేట, కీసర, ఘట్ కేసర్ లకు చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ నుంచి టీడీపీలోకి చేరుతున్నారు. ఇప్పటివరకు ‘వన్ వే’ ట్రాఫిక్ మాదిరి సాగిన టీ టిడిపి ప్రయాణంలో ఈ మార్పు కొత్త ఉత్సాహాన్నిస్తోంది.