Madala Ranga Rao is no moreఎర్రమల్లెలు, ఎర్ర పావురాలు, మరో కురుక్షేత్రం, మహా ప్రస్థానం, నవోదయం, విప్లవశంఖం, బలిపీఠంపై భారతనారి, ఎర్ర సూర్యుడు, ఎర్ర పావురాలు, ప్రజాశక్తి, స్వరాజ్యం… తదితర విప్లవ భావజాలం చిత్రాలతో ప్రేక్షకులలో చెరగని ముద్ర వేయించుకున్న మాదాల రంగారావు అస్తమించారు. హైదరాబాద్ లోని స్టార్ హాస్పిటల్ లో శ్వాసకోశ సంబంధ వ్యాధికి చికిత్స తీసుకుంటూ తుది శ్వాసను విడిచారు.

గత కొన్ని రోజులుగా వెంటిలేటర్ పై ఉన్న 69 ఏళ్ళ విప్లవ చిత్రాల కథానాయకుడు, ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల సమయంలో కాలం చేసినట్లుగా ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి. ‘చైర్మన్ చలమయ్య’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన మాదాల రంగారావు, ఆ తరువాత నవతరం ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి, తొలిసారిగా ‘యువతరం కదిలింది’ చిత్రాన్ని తీసి, బంగారు నంది పురస్కారాన్ని అందుకున్నారు.

సమాజంలో వేళ్లూనుకున్న అవినీతిని తన సినిమాల్లో ప్రతిబింబిస్తూ తెలుగు సినీ ప్రేక్షకులను మెప్పించిన ఘనత మాదాల రంగారావు సొంతం. ఆయన వారసుడిగా మాదాల రవి క్యారెక్టర్ ఆరిస్ట్ గా రాణిస్తున్నాడు. మాదాల మృతిపై టాలీవుడ్ పెద్దలతో పాటు, సీపీఐ, సీపీఏం పార్టీ నేతలు కూడా సంతాపాన్ని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా కోరుకుందాం.