Machilipatnam port tendersచిన్న చిన్న ప్రభుత్వ కాంట్రాక్టులను దక్కించుకోవడానికే పెద్ద పెద్ద స్కెచ్ లు వేసి కాంట్రాక్టర్లు దక్కించుకుంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం… ఏదైనా గానీ గవర్నమెంట్ కాంట్రాక్టులకు మార్కెట్ లో విపరీతమైన క్రేజ్. ఎక్కడైనా ఈ మాటలు చెల్లుబాటు అవుతాయేమో గానీ, ప్రస్తుతం ఏపీలో మాత్రం కాదన్న విషయం తాజా కధనాలు స్పష్టం చేస్తున్నాయి.

3650 కోట్ల అంచనాతో మొదటి దశ మచిలీపట్టణం పోర్టు అభివృద్ధి పనులకు ప్రభుత్వం టెండర్లను పిలిస్తే, కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా టెండర్ వేయకపోవడం రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యింది. మొదటిసారి ఇలాంటి అనుభవమే చవిచూస్తే, రెండవ సారి మళ్ళీ టెండర్లను పిలవడం, గడువు తేదీలను మొత్తంగా ఏడు సార్లు పెంచినా ప్రయోజనం మాత్రం శూన్యం.

2021 జూన్ లో మొదటిసారిగా మచిలీపట్టణం పోర్టు నిర్మాణానికి టెండర్ పిలవగా, ఎలాంటి స్పందన రాకపోవడంతో మూడు సార్లు గడువు పొడిగించారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం రాకపోవడంతో ఆగస్టులో రెండవసారి మళ్ళీ టెండర్లను పిలిచారు. దీనికి కూడా అదే “స్పందన లేని స్పందన.” దీంతో మళ్ళీ మరో నాలుగు సార్లు గడువు తేదీని పెంచినా ఉపయోగం లేకుండా పోయింది.

ఢిల్లీ, పూణేలకు సంబంధించిన పలు సంస్థలతో అధికారులు చర్చలు జరిపినా ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. కనీసం ఒక్క బిడ్ వస్తే వారికైనా పనులను అప్పగించాలని చూసిన అధికారులకు అంతిమంగా నిరాశే ఎదురయ్యింది. అయితే ఇదంతా ఎవరి పుణ్యం? అంటే దానికి సమాధానం… జగన్ సర్కార్ పరిపాలనకు నిలువెత్తు నిదర్శనమే ఈ ఉదంతం అంటున్నాయి ప్రతిపక్షాలు.

కాంట్రాక్టుదారులకు ఇప్పటికే భారీ స్థాయిలో బకాయిలు చెల్లించాల్సి ఉండగా, వాటిని చెల్లించక పోవడంతో ఏపీలో ప్రభుత్వ ప్రాజెక్ట్ లంటే ఏ ఒక్క కంపెనీ కూడా ముందుకు రావడం లేదనేది ప్రతిపక్షాలు చేస్తోన్న ఆరోపణలు. విపక్షాల మాటలు ఎలా ఉన్నా… ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డికి ఇది మాయని మచ్చ అని చెప్పడంలో సందేహం లేదు.

కోటి, రెండు కోట్ల గవర్నమెంట్ కాంట్రాక్టులకే విపరీతమైన పోటీ నెలకొంటుంది. అలాంటిది 3650 కోట్ల అంచనా, అది కూడా కేవలం తొలిదశ వరకే, మలిదశలో మరింత వ్యయం ఉంటుంది. అలాంటి ప్రాజెక్ట్ లకు కూడా ఒక్క కాంట్రాక్టర్ రాలేదంటే, జగన్ ప్రభుత్వం కల్పిస్తోన్న “భరోసా” ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే… ఎన్నో దశాబ్దాల నుండి పోర్టు వస్తుందని కలలు కంటోన్న మచిలీపట్టణం వాసుల ఆకాంక్ష ఇప్పట్లో నెరవేరేలా కనపడడం లేదు.