Maa-Nammakam-Nuvve-Jagan-Sticker-to-housesఏపీలో సంక్షేమ పధకాలు పొందిన 1.65 కోట్ల మంది లబ్ధిదారుల ఇళ్ళకి “మా నమ్మకం నువ్వే జగన్‌” స్టిక్కర్స్ అంటించాలనే వైసీపీ ప్రభుత్వం నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతుండగానే, వారి సెల్ ఫోన్లకి కూడా “జగనన్నే మా భవిష్యత్‌” అనే స్టిక్కర్స్ అంటించాలని నిర్ణయించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

మార్చి 18 నుంచి 26వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. దీనిలో సచివాలయ వైసీపీ సమన్వయకర్తలు, 5.65 లక్షల మంది గృహసారధులు పాల్గొంటారు. ఈ కార్యక్రమం బాధ్యతలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేపట్టాలని సిఎం జగన్మోహన్ రెడ్డి సూచించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా గృహసారధులు, వైసీపీ సమన్వయకర్తలు రాష్ట్రంలో ఇంటింటికీ వెళ్ళి స్టిక్కర్స్ అంటించడంతో పాటు సంక్షేమ పధకాలకి సంబందించిన వివరాలని సేకరించేందుకు వారికి ఓ ప్రశ్నాపత్రాన్ని కూడా ఇచ్చి నింపిస్తారు. “జగన్‌ ప్రభుత్వంపై మాకు నమ్మకముంది,” అని వాటిపై సంతకాలు తీసుకొంటారు. అదే విషయం తెలియజేసేందుకు ఓ ఫోన్‌ నెంబర్ ఇచ్చి దానికి ‘మిస్డ్ కాల్’ ఇమ్మనమని అడుగుతారు. ఎన్నికలకి 14 నెలల సమయం మాత్రమే ఉంది కనుక ఇప్పటి నుంచే ప్రజల మద్యకి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు.

ఈ నిర్ణయంపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ, “సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రచారపిచ్చి పరాకాష్టకి చేరుకొందనిపిస్తోంది. ఆయనకి ఎలాగూ తమ పార్టీ నేతల మీద నమ్మకం లేదు కనుక ముందుగా వారందరి చేతుల మీద ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ అనో లేదా ‘నీ వెంటే మేముంటాం జగన్’ అనో పచ్చబొట్టు పొడిపిస్తే బాగుటుంది,” అని ఎద్దేవా చేశారు.

నాదెండ్ల మనోహర్ వ్యంగ్యంగా ఈ సూచన చేసినప్పటికీ, ప్రజలలో తనకి ఓట్లు వేసేవారెవరో వేయనివారెవరో తెలుసుకొనేందుకు చేస్తున్న ఈ పనిని మొదట తన మంత్రుల నుంచే ప్రారంభిస్తే, చివరివరకు తనతో ఉండేదెవరో, అవకాశం చిక్కగానే పారిపోయేదెవరో తేలిపోతుంది. అప్పుడు పచ్చబొట్టు వేయించుకోవడానికి నిరాకరించిన వారందరినీ పార్టీలో నుంచి బయటకి పంపించేయొచ్చు. ఒకవేళ పచ్చబొట్టు వేసుకొన్నవారిలో కూడా ఎవరైనా ఎప్పుడైనా పార్టీలో నుంచి బయటకి వెళ్ళాలన్నా అది చూపించి వారిని గట్టిగా నీలదీయొచ్చు కూడా!