Maa-Nammakam-Nuvve-Jagan-Sticker-to-housesవచ్చే ఎన్నికలలో గెలిచి మళ్ళీ అధికారం నిలబెట్టుకోవడానికి వైసీపీ ఎంతగా పరితపిస్తుందో తెలుసుకోవడానికి మరో నిదర్శనం “మా నమ్మకం నువ్వే జగన్‌” స్టిక్కర్స్. రాష్ట్రంలో సంక్షేమ పధకాలు పొందిన లబ్దిదారుల ఇళ్ళ గోడలపై ఈ నెల 11వ తేదీ నుంచి ఈ స్టిక్కర్స్ అంటించేందుకు వైసీపీ సన్నాహాలు చేస్తోంది. దీని కోసం సచివాలయ వైసీపీ సమన్వయకర్తలు, గృహసారధులకి వైసీపీ శిక్షణ ఇస్తోంది. రాష్ట్రంలో ఎంతమందికి సంక్షేమ పధకాలు అందజేశామనే విషయం తెలుసుకొనేందుకే లబ్దిదారుల అంగీకారంతో వారి ఇంటి గోడలపై “మా నమ్మకం నువ్వే జగన్‌” స్టిక్కర్స్ అంటించాలనుకొంటున్నట్లు వైసీపీ నేతలు చెపుతున్నారు.

అయితే తమ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పధకాలను తీసుకొంటున్న లబ్దిదారులందరికీ మీరందరూ మా వల్ల లబ్ది పొందారు కనుక తప్పనిసరిగా వైసీపీకే ఓట్లు వేయాలని ప్రతీరోజూ గుర్తు చేయడానికే అని భావించవచ్చు. ప్రతిపక్షాలు కూడా ప్రజల వద్దకి వెళ్ళి తమ పార్టీకి ఓట్లు వేయమని అభ్యర్ధిస్తుంటాయి. కానీ వారందరూ మా పార్టీ ఓటర్లని వారి జోలికి రావద్దని ప్రతిపక్షాలని హెచ్చరించడానికి కూడా లబ్దిదారుల ఇళ్ళకి స్టిక్కర్స్ అంటించబోతున్నట్లు భావించవచ్చు.

అయితే పధకాలు పొందినవారి ఇళ్ళకి స్టిక్కర్స్ అంటించినంత మాత్రన్న వారందరూ తప్పనిసరిగా వైసీపీకే ఓట్లు వేస్తారనుకోవడం అత్యాసే అవుతుంది. టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ చిత్తూరు జిల్లాలో యువగళం పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందంటే అర్దం ఏమిటి?ఆ వేలాదిమందిలో సంక్షేమ పధకాలు పొందినవారు కూడా ఉంటారు కదా?కానీ వారు టిడిపికి ఎందుకు మద్దతు ఇస్తున్నారు?అని ఆలోచిస్తే ఈ స్టిక్కర్లతో ఒరిగేదేమిలేదని అర్దమవుతుంది. పైగా ఈవిదంగా లబ్దిదారుల ఇళ్ళకి స్టిక్కర్స్ అంటించడం ద్వారా వైసీపీ నేతలు తమపై తీవ్ర ఒత్తిడి చేస్తూ భయబ్రాంతులకి గురిచేస్తున్నారని ఎవరైనా కోర్టులో కేసు వేస్తే ప్రభుత్వానికి మళ్ళీ మొట్టికాయలు తప్పవు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని మళ్ళీ గాడినపెట్టి అమరావతిని నిర్మిస్తున్న చంద్రబాబు నాయుడుని కాదని ప్రజలు తమ పార్టీకి ఎందుకు ఓట్లు వేశారో వైసీపీ అధినేతతో సహా పార్టీలో ఎవరూ గ్రహించిన్నట్లు లేదు. ప్రజల ఆకాంక్షలని, సమస్యలని అర్దం చేసుకోకుండా సంక్షేమ పధకాల పేరుతో డబ్బు పంచిపెడుతూ అదే అభివృద్ధి అని భ్రమింపజేయాలనుకోవడం వలననే, ఆనాడు భారీ మెజార్టీతో గెలిచిన వైసీపీ నేడు ఇంత తీవ్రమైన అభద్రతాభావంతో ఉందని చెప్పవచ్చు. కనుక మిగిలిన ఈ కొద్దిపాటి ‘పుణ్యకాలం’లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధి గురించి, రాష్ట్రానికి పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలని రప్పించి నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించగలిగితే ప్రజలు రెండో ఛాన్స్ ఇవ్వడం గురించి ఆలోచించవచ్చు.