Naresh - MAAమూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) లో మరో సారి వివాదాలు బయటపడ్డాయి. ఇప్పటికే రాజశేఖర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అధ్యక్షుడు నరేష్ పై మా ఎగ్జిక్యూటివ్ సభ్యులు తిరుగుబాటు చేశారు. ‘మా’ అభివృద్ధికి న‌రేశ్ అడ్డంకి మారార‌ని, నిధులు దుర్వినియోగం చేయ‌డంతో పాటు ఈసీ స‌భ్యుల‌ను అవ‌మాన‌ప‌రుస్తున్నార‌ని ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.

ఆయనపై చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణా సంఘానికి తొమ్మిది పేజీల లేఖ రాసారు. మాజీ అధ్యక్షుడు శివాజీ రాజాపై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేశారని, నిబంధ‌న‌లు ఉల్లంఘించిన న‌రేశ్‌పై స‌భ్యులు సంఘానికి విజ్ఞ‌ప్తి చేశారు. వీరందరికీ మా జనరల్ సెక్రటరీ జీవిత నాయకత్వం వహిస్తున్నట్టు సమాచారం.

నరేష్ నిర్ణయాలతో ‘మా’ పూర్తిగా భ్రష్టుపట్టి పోతోందని, ‘మా’ సభ్యులు ఆస్పత్రిలో ఉంటే కనీసం పరామర్శించలేద‌ని జీవిత ఆరోపించారు. న‌రేశ్ ఒంటెద్దు పోక‌డ‌ల‌కు పోతున్నార‌ని, స‌భ్యులెవ‌రినీ సంప్ర‌దించ‌కుండానే ఏక ప‌క్ష నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని వారు అంటున్నారు. మా లోని సమస్యలను పరిష్కరించడానికి ఇటీవలే క్రమశిక్షణా సంఘాన్ని ఏర్పాటు చేశారు.

ఇందులో కృష్ణంరాజు, చిరంజీవి, మురళి మోహన్, మోహన్ బాబు, మరియు జయసుధ సభ్యులుగా ఉన్నారు. వారు ఇప్పుడు దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. పదిహేను మంది కంప్లయింట్ చెయ్యడంతో నరేష్ ను సాగనంపుతారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి.