LV Subramanyam to meet Prime Minister Narendra Modiసీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యంను వైఎస్ జగన్ వివాదాస్పద రీతిలో పదవి నుండి తప్పించిన విషయం తెలిసిందే. ఆయనను ఎటువంటి ప్రాధాన్యత లేని హెచ్ఆర్దీ సంస్థకు డైరెక్టర్ జనరల్ గా నియమించారు. ఎల్వీ అలిగి కొత్త పోస్టింగు తీసుకోకుండా నెల రోజుల సెలవు మీద వెళ్లిపోయారు.

ఎన్నికల సమయంలో చంద్రబాబు కు చెక్ పెట్టడానికి ఎల్వీ సుబ్రహ్మణ్యంను రంగంలోకి దించారు. నాటి సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా అతి-ఉత్సాహంగా పని చేశారు. ఆయన ఏ ఉద్దేశంతో అలా వ్యవహరించినా ఎన్నికల వేళ అది వైఎస్సార్ పార్టీకి బాగానే ఉపయోగపడింది. అందుకుగానూ జగన్ ఆయనను కొనసాగించి, తరచూ అన్నా అంటూ ఆప్యాయంగా పలకరించేవారు.

చివరికి… ఆయనను జగన్‌ అవమానకర రీతిలో పదవి నుంచి తప్పించారు. ఇప్పుడు కూడా ఆయనకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉండబోతుందని సమాచారం. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎల్వీ సుబ్రహ్మణ్యం ఢిల్లీలో ఈ నెల 15న కలబోతున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

మరోవైపు ఎల్వీ సుబ్రహ్మణ్యంను కేంద్ర విజిలెన్స్ కమీషనర్ గా నియమిస్తారని కూడా అంటున్నారు. అయితే కేవలం మరో ఐదు నెలల సర్వీస్ మాత్రమే ఉండడంతో ఆయనకు అంతటి కీలకమైన పదవి ఇస్తారా అనేది చూడాలి. ఇస్తే మాత్రం అది జగన్ ప్రభుత్వానికి చెక్ చెప్పడానికే అని క్లియర్ గా అర్ధం అవుతుంది.