low percentage polling in hyderabadతెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు గానూ రాష్ట్రవ్యాప్తంగా 30% ఓటింగు నమోదు అయ్యింది. అత్యధికంగా మెదక్ లో 32% ఓటింగు జరిగితే అత్యల్పంగా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలలో 21% ఓటింగు జరిగింది. సాయంత్రం ఓటింగు ముగిసే సమయానికి కూడా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలు అట్టడుగున ఉండే అవకాశం ఉంది. ఎక్కువగా చదువుకున్న వారు, ఉద్యోగస్తులు ఉండే ఈ జిల్లాలలో ఈ పరిస్థితి అంటే శోచనీయమే.

అయితే ఇది కొత్తేమీ కాదు. అక్షరాస్యత శాతం తక్కువ ఉన్న గ్రామీణ ప్రజానీకం చైతన్యంతో ఎప్పటికప్పుడు ఓటింగు శాతం పెంచుతూ ఉంటే చదువుకున్న వారు మాత్రం ఓటింగు రోజు సెలవు అని సినిమాలు, షికారులు, షాపింగ్ లతో బిజీగా ఉంటున్నారు. పోలింగ్‌ నేపథ్యంలో ఐమ్యాక్స్‌ థియేటర్‌ నిర్వాహకులు శుక్రవారం ఉదయం షోను ప్రదర్శించలేదు. దీంతో ఈ రోజు సూపర్ స్టార్ రజినీకాంత్ ‘2.ఓ’ సినిమా కోసం టికెట్లు పొందిన ప్రేక్షకులు థియేటర్‌ ఎదుట ఆందోళనకు దిగారు.

దీనిబట్టి చదువుకున్న వారి మైండ్ సెట్ అర్ధం అవుతుంది. డబ్బులు తిరిగి చెల్లించడంతో వివాదం సద్దుమణిగింది. పోలింగ్ శుక్రవారం రావడంతో చాలా ఆఫీసులకు శనివారం, ఆదివారం సెలవు కావడంతో చాలా మంది హాలిడేకి కూడా వెళ్లిపోయారు. దీనితో నగరంలోని రోడ్లు నిర్మానుష్యంగా మారిపోయాయి. తెలంగాణ ఎన్నికలలో జీహెచ్ఎంసి కింద ఉండే 24 నియోజకవర్గాల ఫలితాలు కీలకం కానున్నాయి. సాయంత్రం ఐదు గంటల వరకు క్యూ లైన్ లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశాన్ని కలిపిస్తుంది ఎన్నికల కమిషన్. 2014 ఎన్నికలలో 68.5% ఓటింగు నమోదు అయ్యింది.

68.5% ఓటింగు నమోదు అయినా, అంత కంటే ఎక్కువ నమోదైన అది ప్రజకూటమికి అనుకూలం అని లగడపాటి వంటి వారి అభిప్రాయం. అలా ఉంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉండి తెరాసను ఓడగొట్టడానికి ప్రజలు ఎక్కువ సంఖ్యలో బయటకు వస్తున్నట్టు వారి అంచనా. ఈరోజు పోలింగ్ అనంతరం వచ్చే ఎగ్జిట్ పోల్ ఫలితాల బట్టి తెలంగాణ ఓటర్ల తీర్పు ఎటు ఉండబోతుంది అనేది చెప్పవచ్చు. అసలు ఓటరు ఏం తీర్పు ఇచ్చారో తెలుసుకోవాలంటే ఈ నెల 11 వరకు ఆగాల్సిందే.