ఇసుక కొరతతో కూలీ పనులు చేసుకునే కార్మికుల నుండి మొదలైన కష్టాల పర్వంలో రోజులు గడిచే కొద్దీ ఒక్కొక్కరుగా వచ్చి చేరుతున్నారు. ఇటీవలే ఈ జాబితాలో ప్రభుత్వ ఉద్యోగులు జగన్ సర్కార్ కు అల్టిమేటం జారీ చేయగా, సర్పంచ్ లైతే ఏకంగా ఓ ఉద్యమానికే శ్రీకారం చుట్టడానికి సిద్ధమయ్యారు. సినిమా కష్టాలు తెలియనివి కావు. ఈ కోవలోనే మరికొన్ని విభాగాలు వచ్చి చేరుతున్నాయి.

స్పెషల్ పోలీస్ ఆఫీసర్ పేరుతో సఫారీ డ్రెస్సులతో ప్రైవేట్ వ్యక్తులను కాంట్రాక్టు పద్ధతిలో పోలీస్ శాఖ నియమించుకుంది. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో పోలీసులతో కలిసి తనిఖీలు నిర్వహించడం ఈ స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ చేస్తున్నారు. లేటెస్ట్ గా కృష్ణాజిల్లాలోని జగ్గయ్యపేట పరిధిలో విధులు నిర్వహిస్తోన్న ఈ ఆఫీసర్లు మీడియాల వేదికగా తమ గోడును వెలిబుచ్చుకున్నారు.

గడిచిన రెండు సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నామని, అయితే గత ఎనిమిది నెలలుగా తమకు జీతాలు ఇవ్వడం లేదని, ఇల్లు గడిచే పరిస్థితి లేదని, కనీసం పెట్రోల్ కు కూడా డబ్బులు ఉండడం లేదని, జీతాలు ఇవ్వకపోవడంతో ఇప్పటికే కొంతమంది ఉద్యోగాలు కూడా వదులుకున్నారని, దిక్కుతోచని స్థితిలో ఇప్పటికైనా ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకుంటుందని ఆశిస్తున్నట్లుగా తెలిపారు.

ఏపీలో కొనసాగుతున్న ఈ కష్టాల పర్వంలో లారీ ఓనర్లు కూడా చేరారు. ‘గ్రీన్ టాక్స్’ను భారీగా పెంచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సీఎం జగన్ కు లారీ ఓనర్స్ అసోసియేషన్ లేఖ రాస్తూ… డీజిల్ ధర రాష్ట్రంలో మంటెక్కుతోందని, దీనికి తోడు ఇపుడు గ్రీన్ టాక్స్ పెంచితే, ఇక రాష్ట్రంలో లారీలు తిప్పలేమని, గ్రీన్ టాక్స్ పెంపును వెనక్కి తీసుకోవాలని, డీజిల్ ధరలను తగ్గించాలని కోరారు.

రోజులు గడుస్తున్న కొద్దీ ముఖ్యమంత్రి గారికి వినతులు – విన్నపాలు – లేఖలు మరిన్ని వచ్చిపడేలా ఉంటున్నాయి తప్ప, ఎవరూ ప్రశాంతంగా విధులు నిర్వహిస్తున్నట్లు లేదు. సామాన్యుడి నుండి సెలబ్రిటీల వరకు అంతా జగన్ జాగాలో ప్రస్తుతం కష్టాల కడలిలో తేలుతున్నవారే! వీళ్లందరినీ తేరుకునేలా చేసి ఒడ్డుకు చేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే! మరి సీఎం జగన్ ఏం చేస్తారో చూడాలి!?