loksatta-jayaprakash-narayan-pvp-behind-pawan-kalyanఇప్పటివరకు ‘ఏక్ నిరంజన్’ మాదిరి, ‘జనసేన’ పార్టీకి అన్నీ తానై ప్రజల ముందుకు వస్తున్న పవన్ కళ్యాణ్ తదుపరి కార్యాచరణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ‘ఏం చేయాలో, ఎలా చేయాలో అనే దానిపై నాకు పూర్తి స్పష్టత ఉందని’ చెప్తూ అభిమానులకు, కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇస్తున్న పవన్ తాజాగా ఓ సీక్రెట్ ను రివీల్ చేసారు. ‘జనసేన’ పార్టీ గ్రౌండ్ వర్క్ మరో వైపు జరుగుతోందని, అది ఎవరికీ చెప్పాల్సిన పని లేదని, నా వెనుక కూడా చాలా “పెద్దోళ్ళు” ఉన్నారని, సమయం కోసం నేను కూడా వేచిచూస్తున్నానని మిక్కిలి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

సభలు నిర్వహించడానికి కూడా ‘ఈవెంట్ మేనేజర్స్’ను ఆశ్రయిస్తున్న పవన్ కళ్యాణ్ వెనుక ఉన్న ఆ “పెద్దోళ్ళు” ఎవరు? అన్న దానిపై పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ‘జనసేన’ పార్టీ తొలి బహిరంగ సభలో పొట్లూరి వరప్రసాద్ (పివిపి) కనిపించిన విషయం తెలిసిందే. అలాగే అప్పటి ఎన్నికలలో విజయవాడ ఎంపీ స్థానానికి పివిపిని పవన్ రికమెండ్ చేసారన్న వార్తలు హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే తాజా ఇంటర్వ్యూలో ఓ పారిశ్రామికవేత్త 200 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధమయ్యారనే వార్తలను కూడా పవన్ దాటవేసిన తీరు చూస్తుంటే… ఆ ‘పెద్దోళ్ళ’ జాబితాలో పివిపి ఒకరన్న వార్త ప్రధానంగా వినపడుతోంది.

అలాగే ‘లోక్ సత్తా’ పార్టీని అధికారికంగా మూసివేసిన జయప్రకాష్ నారాయణ్ కూడా ‘జనసేన’కు అండదండగా ఉండే అవకాశం లేకపోలేదని రాజకీయ వర్గాల్లో బలమైన ప్రచారం జరుగుతోంది. పవన్ సిద్ధాంతాల మాదిరే ‘డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేయండి’ అంటూ ప్రజలలో చైతన్యం కలిగించిన నాయకులలో జయప్రకాష్ ప్రధముడు. ఈ ప్రచారం ద్వారా 2009 ఎన్నికలలో కొంత శాతం ఓట్లను కూడా చీల్చడంలో జయప్రకాష్ విజయవంతం అయ్యారు కూడా! అదీ గాక, పాలనలోని అన్ని అంశాలపై పూర్తి అవగాహన, రాజ్యాంగంపై పట్టు ఉన్న నేత కావడం ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూరుస్తోంది.

ప్రజాశ్రేయస్సును పవన్ ఆకాంక్షిస్తుంటారు గానీ, వాటిని చట్టరూపేణా ఎలా సాధించాలి, అందుకోవాలి అనే మార్గం మాత్రం తెలియని విషయాలే. దీంతో జయప్రకాష్ ను ముందు పెట్టుకుని పవన్ వెనుక చక్రం తిప్పుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే నిజమై, కార్యాచరణ ప్రకటిస్తే… ఏపీ రాజకీయాల్లో సంచలనాలు నమోదయ్యే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు పవన్ కు అతి పెద్ద లోపాలుగా కనపడిన ఆర్ధిక బలం, అవగాహన బలం… చెరో వైపు నిల్చుంటే… జయహో జనసేన… అనడం అభిమానులకు పెద్ద విషయం కాకపోవచ్చు. మరి ఆ ‘పెద్దోళ్ళ’ను ఎప్పుడు పరిచయం చేస్తాడో చూడాలి.