Lockdown Extension for two more weeksఈ నెల 14తో ముగియనున్న లాక్ డౌన్ పొడిగింపు ఖాయంగా కనిపిప్తోంది. దీన్ని మరో రెండు వారాలపాటు పొడిగించే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. లాక్ డౌన్ పొడిగింపు, కరోనా కట్టడికి రాష్ట్రాలు చేపడుతున్న చర్యలపై ప్రధాని ఇవాళ ఉదయం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ పొడిగింపే అన్ని సమస్యలకు పరిష్కారమని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానికి విన్నవించారు. దీనితో ఆ వైపుగా కేంద్రం మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. అయితే ఈ సారి లాక్ డౌన్ లో కొన్ని సడలింపులు ఉంటాయని అంటున్నారు. అవి ఏంటో తెలియాల్సి ఉంది.

అయితే మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించే అవకాశం లేదని అంటున్నారు. ఇప్పటికే ఒడిశా, పంజాబ్ రాష్ట్రాలు లాక్ డౌన్ ను ఈ నెల 30 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.

మరోవైపు నిన్న రాత్రి నుండి ఈరోజు ఉదయం వరకు ఆంధ్రప్రదేశ్‌లో ఇరవై ఒక్క కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసులను 402కు చేరాయి. తెలంగాణలో నిన్న రాత్రి ఇచ్చిన మెడికల్ బులెటిన్ ప్రకారం 487 కేసులు ఉన్నాయి. ఢిల్లీ జమాత్ కార్యక్రమానికి హాజరైన వారు, వారి కాంటాక్ట్స్ టెస్టులు పూర్తి కావొస్తుండడంతో కేసులు తగ్గుతాయని అంటున్నారు.