Lockdown- Andhra pradesh - telanganaకరోనా రక్కసి వల్ల ప్రజలు అల్లాడిపోతున్నారు. మందులు, ఆక్సిజన్ కొరత తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జబ్బు పడిన వారికి కనీసం బెడ్లు దొరకని పరిస్థితి. గడచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా మూడున్నర లక్షలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. కేసులు ఎక్కువ కావడంతో మొత్తం వైద్య వ్యవస్థ మీద తీవ్ర ఒత్తిడి పడుతుంది.

ఇప్పటికే ఢిల్లీ లాక్ డౌన్ విధించింది. రేపు రాత్రి నుండి రెండు వారాల పాటు లాక్ డౌన్ విధించబోతున్నట్టు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. మహారాష్ట్ర కూడా లాక్ డౌన్ కాకపోయినా గట్టిగానే ఆంక్షలు అమలు చేస్తుంది. దానితో ముంబైలో కొంత మేర కేసులు తగ్గుతున్నాయి. దానితో లాక్ డౌన్ తప్ప వేరే ఆప్షన్ లేదని అర్ధం అవుతుంది.

దీనితో రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా లాక్ డౌన్ తప్పదని సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే ఎప్పుడు ఎలా అనేది చూడాలి. ప్రభుత్వాలు మాత్రం లాక్ డౌన్ వల్ల కలిగే ఆర్ధిక నష్టాల కారణంగా వీలైనంతగా లాక్ డౌన్ వరకు వెళ్లకూడదనే అనుకుంటున్నాయి. అయితే అది సాధ్య పడుతుందా అనేది అనుమానమే.

మరోవైపు… గత వారం రోజుల్లో పాజిటివిటీ రేటు 10% దాటినా ఆక్సిజన్‌, ఐసీయూ పడకల భర్తీ 60% మించిన ప్రాంతాల్లో మినీ లాక్‌డౌన్‌ తరహాలో ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ప్రకారం చుసినా రెండు తెలుగు రాష్ట్రాలలో లాక్ డౌన్, లేక లాక్ డౌన్ వంటి ఆంక్షలు తప్పకపోవచ్చు.